మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టుగా ఓ ప్రమాదంలో గాయపడిన వారు స్వస్థలాలకు వెళ్లే క్రమంలో మరో సారి ప్రమాదానికి గురై గాయపడ్డారు. ప్రమాదానికి గురైన కొద్ది గంటల్లోనే మరో ప్రమాదం వెంటాడడంతో భయబ్రాంక్తులకు లోనయ్యారు.
ప్రమాదం ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో తెలియదు. ఎప్పుడు ఎలా ప్రాణాలు గాల్లో కలుస్తాయో ఊహించలేము హఠాత్తుగా జరిగే ప్రమాదాలు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపుతాయి. నిన్న జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఎన్నో హృదయవిదారక ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ హఠాత్పరిణామంతో దేశమంతా అలజడికి గురైంది. ఆ ట్రైన్ లో ప్రయాణించిన తమ వారి ఆచూకి కోసం కుటుంబ సభ్యులు బిక్కుబిక్కు మంటూ ఎదురుచూస్తున్నారు. దశాబ్థకాలంలో చోటుచేసుకున్న ఇంతటి ఘోర రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదం వెనుక సాంకేతిక లోపం వల్ల జరిగిందా? లేక మానవ తప్పిదం వల్ల జరిగిందా అనేది తెలియదు గానీ ఒకే ఒక్క లోపం కారణంగా ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వెయ్యి మందికి పైగా తీవ్రగాయాలు అయ్యాయి. ఆ లోపం ఏమిటి? అదొక్కటి ఉండి ఉంటే ఈ ప్రమాదం జరగకపోదునా?