ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తోన్న పదం.. 'గోల్డ్ ఐఫోన్'. అందుకు కారణం.. అర్జెంటీనా ఫుట్ బాలర్ లియోనల్ మెస్సీ. గతేడాది ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2022 టోర్నీని అర్జెంటీనా సొంతం చేసుకున్న విజయానికి గుర్తుగా మెస్సీ.. తన జట్టు సభ్యులు, సిబ్బందికి బంగారు ఐఫోన్లను కానుకగా అందజేశాడు. ఆనాటి నుంచి గోల్డ్ ఐఫోన్ అన్న పదం తరచూ వార్తల్లో నిలుస్తోంది.
అర్జెంటీనా స్టార్ ఫుట్ బాలర్ లియోనల్ మెస్సీ ఇటీవల తమ జట్టు సభ్యులకు, సిబ్బందికి గోల్డ్ ఐఫోన్స్ బహుమతిగా ఇచ్చిన సంగతి అందరికి విదితమే. ఫిఫా ప్రపంచకప్ 2022 విజయానికి గుర్తుగా, ఆ చారిత్రాత్మక క్షణాలను గుర్తుచేసుకుంటూ మెస్సీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. మొత్తం 35 బంగారు ఐఫోన్లను.. రూ.1.73 కోట్లు వెచ్చించి 24 క్యారెట్ల బంగారంతో ప్రత్యేకంగా తయారు చేయించి వాటిని తన సహచరు ఆటగాళ్లు, సిబ్బందికి కానుకగా అందజేశాడు. ఆనాటి నుంచి గోల్డ్ ఐఫోన్స్ ఎలా ఉంటాయి..? వాటి ధర ఎంత..? స్పెసిఫికేషన్స్ ఏంటి..? అంటూ నెటిజన్స్ తెగ శోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోల్డ్ ఐఫోన్స్ గురుంచి మరింత సమాచారం మీకోసం..
ఐఫోన్ ను ‘ఆపిల్’ కంపెనీ తయారు చేస్తుంది సరే.. మరి గోల్డ్ ఐఫోన్ ను ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అన్న సందేహం మీకు కలగొచ్చు. వాస్తవానికి గోల్డ్ ఐఫోన్ అనేది.. ఆర్డర్ ఇచ్చి చేపించుకునే వస్తువు. అచ్చం బంగారు ఆభరణాలను ఎలా ఆర్డర్ ఇచ్చి చేపించుకుంటారో.. అలా చేపించుకోవచ్చన్నమాట. మీకు ఏ మోడల్ కావాలన్నది మీ ఇష్టం.. ఐఫోన్ 13 కావాలన్నా చేస్తారు.. 14 కావాలన్నా చేస్తారు. ఎంచుకున్న మోడల్, బంగారం ఎంత వినియోగించాలన్న దానిపై ధర ఆధారపడి ఉంటుంది. ఫ్రంట్, బ్యాక్ ప్యానెల్ మొత్తం బంగారు పూత పూస్తారు. దీంతో ఫోన్ బంగారు వర్ణంతో ధగ.. ధగ మెరుస్తూ ఉంటుంది.
ఇదిలావుంటే, మెస్సి కానుకగా అందజేసిన ఫోన్లు ఐఫోన్ 14 మోడల్ అని ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఫోన్ కోసం దాదాపు రూ. 5 లక్షల మేర వెచ్చించారని సమాచారం. ఈ మోడళ్లను ఆపిల్ కంపెనీ గతేడాది సెప్టెంబర్లో లాంచ్ చేసింది. ఇక వీటి స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఏ15 బయోనిక్ చిప్ సెట్ అందించారు. అలాగే, ఎలాంటి లైటింగ్ లో అయినా అద్భుతంగా ఫోటోలు తీయగలిగే అడ్వాన్స్డ్ కెమెరా పొందుపరిచారు. ఐఫోన్ 14 ధర మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభమయ్యాయి. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్లో ఐఫోన్ 14 కొనసాగింపుగా ఐఫోన్ 15 విడుదల కానుంది. గోల్డ్ ఐఫోన్లపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.