ఉద్యోగం వచ్చిన వెంటనే ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సింది భవిష్యత్తు గురించే. ఉద్యోగ విరమణ తర్వాత జీవితం ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి ఉద్యోగంలో చేరిన వెంటనే ఆలోచించకపోతే ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. చాలా మందికి ఉద్యోగ విరమణ తర్వాత కూడా తమ కాళ్ళ మీదనే నిలబడాలనుకుంటారు. అలాంటి వారు టెన్షన్ లేకుండా పెన్షన్ తో జీవితాన్ని గడిపేస్తుంటారు. అయితే ఆ పెన్షన్ కూడా జీతంలా భారీగా రావాలంటే ఏం చేయాలో అనేది ఇప్పుడు తెలుసుకోండి.
చాలా మంది తెలివైన ఉద్యోగులు ముందు నుంచే తమ జీతంలో కొంత పక్కకు తీసి మ్యూచువల్ ఫండ్స్ అని, స్టాక్ మార్కెట్ అని ఇలా రకరకాల వాటిలో పెట్టుబడులు పెడుతుంటారు. ఆ డబ్బుల విలువ ఉద్యోగ విరమణ సమయానికి భారీగా పెరుగుతుంది. అయితే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి అంటే రిస్క్ కాబట్టి చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో నెల నెలా SIP(సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్)లో పెట్టుబడి పెట్టడం ద్వారా రిటైర్మెంట్ తర్వాత నెలకి రూ. లక్ష వరకూ పెన్షన్ వస్తుంది.
దీని కోసం రిటైర్మెంట్ ఫండ్ ను SWP(సిస్టమేటిక్ విత్ డ్రాల్ ప్లాన్)లో పెట్టుబడి పెట్టాలి. ఇన్వెస్టర్ హైబ్రిడ్ లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ SWP ఫండ్ ను ఎంచుకుంటే ఏడాదికి 7 నుంచి 8 శాతం రాబడి వస్తుంది. అయితే పదవీ విరమణ తర్వాత ద్రవ్యోల్బణాన్ని 6 శాతం వద్ద ఉంచినట్లయితే.. నెలకి రూ. లక్ష పింఛను పొందడానికి SWPలో 2.76 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. రాబోయే 30 ఏళ్లలో ఈ రూ. 2.76 కోట్లతో నెలకి రూ. లక్ష పెన్షన్ పొందాలంటే.. ఆ వ్యక్తి తన వార్షిక ఆదాయంలో 10 శాతం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలి. ఇలా చేస్తే మ్యూచువల్ ఫండ్స్ SIPలో పెట్టుబడి పెట్టిన వ్యక్తి 15 శాతం రాబడిని ఆశించవచ్చు.
ఒక వ్యక్తి 2.76 కోట్లు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఆ వ్యక్తి ప్రతీ సంవత్సరం SIP ని 10 శాతానికి పెంచాలి. ఇలా చేస్తే మ్యూచువల్ ఫండ్స్ 15 శాతం వార్షిక రాబడిని ఇస్తుంది. ఈ ప్లాన్ ఎంచుకుంటే గనుక 30 ఏళ్ల వయసులో రూ. 2,200తో SIPని ప్రారంభించాలి. ఈ లెక్కన ఆ వ్యక్తి 30 ఏళ్లలో ఇన్వెస్ట్ చేసిన మొత్తం సొమ్ము రూ. 43,42,642కి చేరుతుంది. 30 ఏళ్ల తర్వాత అతని మొత్తం పెట్టుబడి రూ. 2,35,94,709కి పెరుగుతుంది. ఎస్బీఐ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ, కోటక్ డెట్ హైబ్రిడ్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా పదవీ విరమణ తర్వాత నెలకి రూ. లక్ష పొందవచ్చు.