ప్రతి మనిషిలో ప్రతిభ అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే దాన్ని గుర్తించి బయటకు వెలికి తీసినప్పుడే ఆ వ్యక్తికి సరైన గుర్తింపు లభిస్తుంది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ప్రతిభకు చదువు ప్రమాణికం అని చాలా మంది భావిస్తారు. అయితే మనిషి తెలివికి చదువుకు అసలు సంబంధం ఉండదు. అక్షరం ముక్క రాని వాళ్లుకూడా అనేక కొత్త విషయాలను కనుగొన్నారు. మరికొందరు అయితే కేవలం అక్షర పరిజ్ఞానంతోనే అద్భుతాలను సృష్టించారు. ఒక విషయంపై మనకు ఉండే ఆసక్తే… ఆ రంగంలో ఉన్నత స్థితికి చేరేందుకు తోడ్పడుతుంది. గుంటూరు జిల్లాకు చెందిన వెంకటన నారాయణ కూడా ఆ వర్గానికి చెందిన వ్యక్తే. ఆయన చదివింది కేవలం పదో తరగతి.. అయితేనేమి మెకానికల్ ఫీల్డ్ పై ఉన్న ఆసక్తితో కొత్త కొత్త మిషన్లు కనిపెట్టారు. అంతే కాక ఇంజినీరింగ్ లోని మెకానికల్ విద్యార్థులకు శిక్షణ సైతం ఇస్తున్నారు. నూతన ఆవిష్కరణలో వెంకటనారాయణ అందరిని అబ్బురపరుస్తున్నారు. ఇక ఆయన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వెంకటనారాయణ స్వగ్రామం పల్నాడు జిల్లా వినుకొండ. ఆయన పదో తరగతి వరకు చదువుకుని కుటుంబ ఆర్ధిక పరిస్థితుల కారణంగా చదువును ఆపేశారు. అనంతరం ఎలక్ట్రానిక్స్, బ్యాటరీల పనుల్లో నైపుణ్యం సంపాదించారు. ఆయన ఊరిలోనే చిన్న దుకాణం పెట్టి ఎలక్ట్రిక్ వస్తువులకు మరమ్మతులు చేసేవారు. అంతేకాక 30 ఏళ్ల క్రితం ఎంతో మంది నివాసలకు బ్యాటరీల ద్వారా బల్బులు వెలిగేలా చేశారు. అలా ఆ గ్రామాల ప్రజల ఆనందంలోనే ఆయన సంతోషం వెతుక్కునే వారు. అలానే బ్యాటరీలపై వివిధ రకాల ప్రయోగాలు చేసేవారు. 25 ఏళ్ల క్రితం కుమార్ పంప్స్ లో ఉద్యోగం రావడంతో తెనాలి వెళ్లారు.
ఇక అప్పటి నుంచి తెనాలిలోనే ఉంటున్నారు. అయితే ఉద్యోగం చేసుకుంటూనే మోకానికల్ ఫీల్డ్ పై తనకు ఉన్న ఆసక్తిని కొనసాగిస్తూ వచ్చారు. అందులో భాగంగా 10 ఏళ్ల కిందట ఒక పాత ఆటోను కొనుగోలు చేసి.. దాని ఇంజిన్ తీసేసి… సోలార్ శక్తితో నడిచే విధంగా తయారు చేశారు. అయితే ఆ ఆటోను నడిపించే క్రమంలో కొన్ని సాంకేతికి సమస్యలను గుర్తించి.. వాటిని సరిచేశారు. అలా ఆటో విషయంలో వెంకటనారాయణ విజయం సాధించారు. అలానే బైక్ లకు సంబంధించిన విడి భాగాలు కొనుగోలు చేసి.. తనకు నచ్చిన విధంగా బైక్ ను తయారు చేసుకునే వారు. బెంగళురులో విరి విరిగా వాడే రెండు సీట్లు ఉండే ఎలక్ట్రిక్ కారును రూ.40 వేలకు కొనుగోలు చేశారు. దానికి సోలార్ ప్యానెల్స్ బిగించి.. సౌరశక్తితో తాను రూపొందించిన వాహనాన్ని నడుపుతున్నారు. తాను తయారు చేసుకున్న బ్యాటరీకి సోలార్ శక్తితో ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ అయితే 150 కిలోమీటర్లు కారు ప్రయాణిస్తుందని ఆయన తెలిపారు.
ఇలా కేవలం మోటర్ వాహనాలే కాకుండా ఇంటిలో నీటి మోటార్లతో సహా పలు వస్తువులను సౌరశక్తితో పని చేసేలా ఏర్పాటు చేశారు. దీని వల్లన కరెంట్ ఆదా అవ్వడమే కాకుండా నెలకు రూ.1000 వరకు ఆదా అవుతుందని తెలిపారు. ఇదే సమయంలో ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మెకానికల్ విద్యార్ధులకు వాహనం తయారీ గురించి శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే పలు రకాల యంత్రాల తయారీలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. తన ఆలోచనలను ఆచరణలో పెడుతూ.. ఆధునిక పద్ధతలను అంది పుచ్చుకుంటూ వెంకటన నారాయణ చేస్తున్న విభిన్న ప్రయత్నాలు.. యువతకు ఆదర్శం. మరి.. వెంకట నారాయణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి