ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ విక్రయంపై ఇప్పటికి పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. టికెట్ల విక్రయాలపై రోజుకో వార్త వినిపిస్తోంది. తాజాగా టికెట్ల విక్రయంపై ఏపీ సర్కార్.. థియేటర్ల యాజమాన్యాలకు కొన్ని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. “ఆన్ లైన్ లో సినిమా టికెట్లు మేమే అమ్ముతాం. వసూళ్ల సొమ్ము నేరుగా మా నిర్వహణలోని ఖాతాకే చేరుతుంది. తర్వాత అందులో సేవారుసుము మినహాయించుకుని మిగతా మొత్తాన్ని మీ ఖాతాల్లో వేస్తాం. దీనికి తప్పనిసరిగా అంగీరిస్తూ ఒప్పందు చేసుకోవాల్సిందే. లేదంటే మీ లైసెన్సు రద్దవుతుంది” అని థియేటర్ల యాజమాన్యాలకు ఏపీ ప్రభుత్వం హూకం జారీ చేసింది. దీనికి సంబంధించి ఈనెల 2న ప్రభుత్వం ఉత్తర్వుల్చింది.
ఏపీలో ఆన్ లైన్ విధానంలో సినిమా టికెట్లు విక్రయంచేందుకు వీలుగా ప్రభుత్వం ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు ఈ బాధ్యత అప్పగించింది. దీంతో ఆన్ లైన్ టికెట్ల అమ్మకాల కోసం ఓ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసేందుకు APFDC ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో సినిమా టికెట్లు అమ్మాలంటే థియేటర్లతో ఒప్పందాలు చేసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వం విధించిన నిబంధన కీలకంగా మారింది. సినిమా టికెట్లను ఏపీఎఫ్డీసీ ద్వారా తామే అమ్ముతాము, వాటిలో థియేటర్లకు వచ్చే వాటాను టికెట్లు అమ్ముడయ్యాక ఇచ్చేస్తామంటూ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఆ నియమ నిబంధనలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఎగ్జిబిటర్లు.. స్పష్టత రానిదే ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ససేమిరా అంటున్నారు. “ఒప్పందంపై సంతకాలు చేస్తే సినిమా టికెట్ల వసూళ్లన్నీ ప్రభుత్వ నిర్వహణలో ఉండే ఖాతాల్లోకి వెళ్లిపోతాయి. వారు సకాలంలో ఆ సొమ్ము మాకు ఇవ్వకపోతే గట్టిగా అడిగి రాబట్టుకోగలమా?. ఇప్పుడా డబ్బు ప్రభుత్వం వద్ద ఆగిపోతే.. మా పరిస్థితి ఏంటి?” అని ఓ ఎగ్జిబిటర్ ప్రశ్నించారు.
ఓ సినిమా టికెట్లు అడ్వాన్స్ గా అమ్మేశారు. ఆ తర్వాత సినిమా పడలేదు. అప్పుడు ప్రేక్షకులకు డబ్బులు ఎవరు తిరిగి చెల్లిస్తారని మరో ఎగ్జిబిటర్.. తన సందేహాన్ని వ్యక్తం చేశారు. అలాగే థియేటర్ కు వచ్చి నేరుగా టికెట్లు కొనే వారికి ప్రభుత్వం విధిస్తున్న 2% సేవా రుసుము ఎందుకని ఎగ్జిబిటర్లు అడుగుతున్నారు. మరోవైపు ప్రభుత్వానికీ, ఎగ్జిబిటర్లకు మధ్య జరిగిన ఒప్పంద ఉల్లంఘన జరిగితే అమరావతిలోని మధ్యవర్తిత్వ కేంద్రంలో పరిష్కరించుకోవాలనే వాదనపైనా అభ్యంతరాలు చెప్తున్నారు. అందులో అందరూ ప్రభుత్వ ప్రతినిధులే ఉంటే ఎగ్జిబిటర్లకు న్యాయం జరుగుతుందా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇరువైపుల ఎవరి వాదనలు వారు చెబుతున్నారు. మరి.. ఏపీలోని ఈ టికెట్ల ఇష్యూపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.