సాకే భారతి ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. కూలి పనులు చేసుకునే స్థాయి నుంచి పీహెచ్డీ స్థాయికి ఎదిగిన గొప్ప మహిళ. అలాంటి ఆమెకు జగన్ సర్కార్ అండగా నిలిచింది.
కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే అనుకున్నది ఏదైనా సాధ్యమే అని నిరూపించారు సాకే భారతి. పేదరికంలో పుట్టి కూలి పనులు చేసుకుంటూ కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. కూలి పనుల భారతి నుంచి డాక్టర్ భారతిగా ఎదిగిన తీరుకి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా పలువురు ప్రముఖులు, నాయకులు ఆమెను అభినందించారు. ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చదువుల తల్లి సరస్వతి అంటూ కొనియాడుతున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి ఈరోజు డాక్టర్ భారతిగా నిలబడిన సాకే భారతికి ఏపీ ప్రభుత్వం అండగా నిలబడింది.
అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగులగుడ్డం గ్రామానికి చెందిన డాక్టర్ సాకే భారతి కష్టానికి ప్రతిఫలం, ఆమె ప్రతిభకు గౌరవం దక్కాయి. సాకే భారతి ప్రతిభను మెచ్చిన ఏపీ ప్రభుత్వం ఆమెకు బహుమతి ప్రకటించింది. రెండెకరాల భూమి, జూనియర్ లెక్చరర్ పోస్టు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శింగనమల మండలం సోదనపల్లి గ్రామం వద్ద సర్వే 9-12లో ఉన్న రెండెకరాల భూమి పట్టాను జిల్లా కలెక్టర్ గౌతమి.. సాకే భారతికి అందించారు. అనంతరం ఆమెను ప్రశంసించారు. కూలి పనులు చేస్తూ కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేయడం జిల్లాకే గర్వకారణమని జిల్లా కలెక్టర్ అన్నారు. ఆమె అంగీకరిస్తే శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ పోస్టుకి నామినేట్ చేస్తామని అన్నారు.
జిల్లా యంత్రాంగం నుంచి ఆమెకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని.. ప్రభుత్వ ఆదేశానుసారం ఆమెకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. అంతేకాకుండా సగంలో ఆగిపోయిన ఆమె ఇంటి నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరు అనడానికి సాకే భారతి నిదర్శనమని.. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. మరి సాకే భారతి కష్టానికి, ప్రతిభకు తగ్గ గౌరవం, గుర్తింపు, ప్రతిఫలం అందించిన ఏపీ ప్రభుత్వంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.