ఆస్ట్రేలియా సంప్రదాయం తెలియక షోయబ్‌ అక్తర్‌ కామెంట్లు..

shoaib akhtar reaction

రావల్పిండి ఎక్స్‌ ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ క్రికెట్‌ కు సంబంధించి దాదాపు అన్ని విషయాలపై అడిగినా.. అడగకపోయినా స్పందిస్తూనే ఉంటాడు. అలా అడగకుండానే స్పందించి.. ఈసారి బాగా విమర్శలు, నెటిజన్ల కౌంటర్లకు గురయ్యాడు షోయబ్‌ అక్తర్‌. విషయం ఏంటంటే.. ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ లో విజయం తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలారు. ఆ సమయంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు కొందరు షూలో బీరు పోసుకుని తాగారు. ఆ వీడియోను ఐసీసీ అధికారిక ఖాతాల్లో షేర్‌ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. వాటిని షోయబ్‌ అక్తర్‌ ట్విట్టర్ లో షేర్‌ చేశాడు.

ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ ‘సంబరాలు కాస్త.. విరక్తి కలిగించే విధంగా ఉన్నాయి కదూ?’ అంటూ నెటిజన్లను ప్రశ్నించాడు. అందుకు పాకిస్తాన్‌ అభిమానులు అందరూ కాస్త కాదు.. బాగానే విరక్తి కలిగిస్తున్నాయి అంటూ కామెంట్‌ చేశారు. అసలు విషయం తెలిసిన వారు ‘ఎదుటి వారి సంప్రదాయాల గురించి తెలియనప్పుడు ఎందుకు కామెంట్‌ చేస్తారు? మీలాంటి వారే ఇలా మాట్లాడితే సాధారణ ప్రజలు ఎలా మాట్లాడతారు?’ అంటూ నెటిజన్లు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. అలా చేయడాన్ని ‘షూఈ’ అంటారు. అది ఆస్ట్రేలియా సంప్రదాయం.

షూఈ..

అలా షూలో డ్రింక్‌ తాగడం అనేది ఆస్ట్రేలియా సాంప్రదాయంగా మారిపోయింది. 1990ల్లోనూ క్రీడా కార్యక్రమాల్లో విజయం తర్వాత ఈ విధంగా షూలో డ్రింక్‌ తాగేవారని కొందరు ప్రస్తావించారు. 15 ఏళ్ల క్రితం ఒక సర్ఫింగ్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్‌ లో ఇలా షూలో డ్రింక్‌ తాగిన వీడియో ఒకటి బయట పడింది. అలా చేయడాన్ని ‘షూఈ’ అంటారు. అంటే వారిది లేదా ఎవరిదైనా షూ నిండా ఆల్కహాల్‌(ఎక్కువగా బీర్‌ ను ఉపయోగిస్తారు) పోసుకుని.. అది వారి చొక్కాపై పడేలా తాగుతారు. అలా తాగిన వ్యక్తి లేదా మరొకరు ఆ తడి షూను రాత్రంతా ధరించాలి. ముఖ్యంగా అభిమానులు ‘డూ ఏ షూఈ’ అని డిమాండ్‌ చేసిన సందర్భాల్లో పాప్‌ సింగర్స్‌, క్రీడా ఈవెంట్లలో ఇలా చేస్తారు. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన ఎందరో సెలబ్రిటీలు ఇలా చేశారు. వారిలో ఆస్ట్రేలియా ఫార్ములా వన్‌ రేసర్‌ డేనియల్‌ రికియార్డో, సినీ తారలు సర్‌ ప్యాట్రిక్‌ స్టువర్ట్‌, గెరార్డ్‌ బట్లర్‌, జిమ్మీ ఫాల్కన్‌ అలా తాగారు. మ్యుజీషియన్స్‌ స్టోర్మ్‌ జీ, మెకైన్‌ గన్‌ కెల్లీ, అమైన్‌, లూక్‌ బ్రాన్‌, హ్యారీ స్ట్రైల్స్‌ వంటి తారలు ‘షూఈ’ చేసిన వారే. ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టొయినిస్‌, మాథ్యూ వేడ్‌ ఈ లిస్ట్‌ లో చేరారు. షూఈ సాంప్రదాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.