సచిన్ కి మాత్రమే ఇంత క్రేజ్ ఎలా సాధ్యం అయ్యింది?

Sachin Birthday

ఎక్కడైనా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి దేవుడు మనుషుల రూపంలో వస్తాడు అంటారు. కానీ.., కొన్ని దశాబ్దాల పాటు ఇండియన్ క్రికెట్ టీమ్ కష్టాల్లో ఉన్న ప్రతిసారీ జట్టుని ఆదుకోవడానికి ఆ దేవుడే స్వయంగా బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లోకి వచ్చేవాడు!
5 అడుగుల 4 అంగుళాల ఎత్తు,
రింగులు తిరిగిన జుట్టు,
ప్రశాంతంగా కనిపించే మొహం,
చేతిలో వజ్రాయుధాన్ని తలపించే ఓ క్రికెట్ బ్యాట్,
అలా ఆయన క్రీజ్ లోకి వస్తుంటే భారతీయుల హృదయాలు పులకించిపోయేవి.
ఆ దేవుడి పేరే సచిన్ రమేశ్ టెండూల్కర్!
100 కోట్ల మంది భారతీయుల కలలని, అంచనాలని.. 24 సంవత్సరాల పాటు చిరునవ్వుతో భరించిన ఆ క్రికెట్ దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.Sachinసచిన్.. అప్పట్లో ఎక్కడ పట్టినా ఈ పేరే వినిపించేది. ఎవరు పట్టినా సచిన్ గురించే మాట్లాడుకునేవారు. ఇండియా మ్యాచ్ గెలుస్తుందా? ఓడిపోతుందా? అని అడిగే వారి కన్నా.. సచిన్ ఉన్నాడా? ఔట్ అయ్యాడా? అని అడిగే వారే ఎక్కువ. సచిన్ క్రీజ్ లో ఉంటే చాలు.. మ్యాచ్ మనదే అనే నమ్మకం అది. సచిన్ కొట్టే కవర్ డ్రైవ్, స్ట్రైట్ డ్రైవ్, రివర్స్ స్వీప్, హుక్ షాట్, అప్పర్ కట్స్ చూడటంలో ఉండే మజా.. కోట్ల మందిని టీవీల ముందు కట్టి పడేసింది. ఒక క్రికెట్ మ్యాచ్ కి ఇంత టి.ఆర్.పి వస్తుందా అని ఇంటెర్నేషనల్ స్పోర్ట్స్ ఛానెల్స్ బిత్తరపోయేలా చేసింది. మా మ్యాచ్ టెలికాస్ట్ చేయండి ప్లీజ్ అంటూ.. ఛానెల్స్ కి డబ్బులు కట్టే స్థాయి నుండి.. ఈరోజు ఒక్కో మ్యాచ్ కోసం కోట్ల రూపాయలు ఛానెల్స్ నుండి డబ్బులు తీసుకునే రేంజ్ కి బీసీసీఐ ఎదిగింది అంటే అదంతా సచిన్ చలవే. ఇలా.. కేవలం సచిన్ కారణంగానే ఇండియాలో ఒక క్రికెట్ ఒక మతం అయ్యింది. ఆయనే క్రికెట్ దేవుడు అయ్యాడు.

  • 1998 కోకా కోలా కప్. షార్జాలో సచిన్ ఆట చూశాక ఈ మతాన్ని స్వీకరించి మంచి పని చేశామని కోట్ల మంది అభిమానులు ఆనందించారు.
  • 1999 వరల్డ్ కప్. అకస్మాత్తుగా తండ్రి మరణం. అంత్యక్రియలు ముగించుకొచ్చి, అంతటి దుఃఖంలో కూడా సచిన్ కెన్యాపై కొట్టిన ఆ సెంచరీకి జాతి మొత్తం నిలబడి సెల్యూట్ చేసింది.
  • 2003 వరల్డ్ కప్.. తనని చెప్పి అవుట్ చేస్తామన్న పాకిస్థాన్ ఆటగాళ్లకి.. చుక్కలు చూపించి, శివ రాత్రి రోజున శివ తాండవం ఆడిన సచిన్ ను చూసి కాలర్ ఎగరేయని భారతీయుడు లేడు.
  • 2011 వరల్డ్ కప్ గెలిచాక పట్టరాని ఆనందంతో గెంతులు వేసిన ఆ దేవుడిలో చిన్న పిల్లాడిని చూసి మురిసిపోయిన క్షణాలు ఇప్పటికీ పదిలమే.
  • 2013 లో సచిన్ రిటైర్డ్ అయ్యి వెళ్లిపోతుంటే.. ఎన్ని హృదయాలు కన్నీరు కార్చాయో లెక్కే లేదు. మ్యాచ్ ఏదైనా, గ్రౌండ్ ఏదైనా సచిన్ సచిన్.. సచిన్ సచిన్.. సచిన్ సచిన్.. అనే నినాదాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. వినిపిస్తూనే ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ క్రికెట్ దేవుడి ఘనతలు ఎన్నో.

Sachinసచిన్ సెంచరీ.. భారత్ ఘన విజయం,

శతక్కొట్టిన సచిన్,

శివాలెత్తిన సచిన్,

సచిన్ ఒంటరి పోరాటం వృధా,

సచిన్ సెంచరీ.. విజయం దిశగా భారత్,

సచిన్ విరోచిత పోరాటం,

సచిన్ శివతాండవం..Sachinఇలాంటి పేపర్ కటింగ్స్ పుస్తకాల్లో దాచుకుని.. అపురూపంగా చూసుకున్న క్షణాలను ఎలా మరచిపోగలం? ఇలా సచిన్ అందించిన జ్ఞాపకాలు ఎన్నెన్నో. అయినా మాపిచ్చి గాని..100 సార్లు 100 కొట్టిన దేవుడిని.. ఎన్ని అక్షరాలతో అభిషేకిస్తే మాత్రం సరిపోతుంది? అందుకే మన క్రికెట్ దేవుడు నిండు నూరేళ్లు.. ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఆయనకి సుమన్ టీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది. మరి.. సచిన్ గురించి మీ అభిప్రాయాలను తెలుపుతూ, కామెంట్స్ రూపంలో ఆయనకి విషెష్ అందించండి.


మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.