క్లాస్ ఇమేజ్ కలిగిన నాగశౌర్య ఈ మధ్య పంథా మార్చి మాస్ ఇమేజ్ కోసం కమర్షియల్ సినిమాలను ఎంచుకుంటున్నారు. కానీ అవి అంతగా ఆకట్టుకోవడం లేదు. దీంతో మరోసారి రంగబలి సినిమాతో లక్ పరీక్షించుకోవాలని చూస్తున్నారు. మరి రంగబలి సినిమాతో నాగశౌర్య ఖాతాలో హిట్ పడిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.
రొమాంటిక్ లవ్ స్టోరీలతో క్లాస్ ప్రేక్షకుల మద్దతు సంపాదించుకున్న నాగశౌర్య మాస్ ఇమేజ్ కోసం కమర్షియల్ చిత్రాలను ఎంచుకుంటూ వస్తున్నారు. ఛలో, అశ్వద్ధామ, లక్ష్య వంటి సినిమాలతో వచ్చిన నాగశౌర్యకు ఛలో రేంజ్ లో హిట్ అయితే పడలేదు. దీంతో మరోసారి రంగబలి సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బాక్సాఫీస్ ముందుకు వచ్చేసారు. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వచ్చిన ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా యుక్తి తరేజా నటించారు. మరి ఈ సినిమా నాగశౌర్య ఖాతాలో హిట్ రూపంలో జమ అయ్యిందా? లేదా? సమీక్షలో చూద్దాం.
సొంత ఊరిలో రాజులా బతకాలని షో చేస్తూ బతుకుతుంటాడు శౌర్య అలియాస్ షో (నాగశౌర్య). అందరూ తనవైపు చూడాలని అందరి ముందు బడాయికి పోతూ షో చేస్తూ ఉంటాడని షో అని నిక్ నేమ్ పెట్టారు. శౌర్య తండ్రి విశ్వం (గోపరాజు రమణ) ఊళ్ళో మందుల దుకాణం నడుపుతూ గౌరవంగా జీవిస్తూ ఉంటాడు. తన కొడుకు శౌర్యకు ఆ షాపు బాధ్యతలు అప్పజెప్పాలని తండ్రి అనుకుంటాడు. కానీ శౌర్య మాత్రం ఊళ్ళో గొడవలు పెట్టుకుంటూ, ఫ్రెండ్స్ తో తిరుగుతూ బాధ్యత లేకుండా ఉంటాడు. దీంతో తండ్రి శౌర్యను వైజాగ్ పంపిస్తాడు. అక్కడ శౌర్య ఫార్మసీ శిక్షణ కోసం ఓ మెడికల్ కాలేజీలో చేరతాడు. సహజ (యుక్తి తరేజ)తో ప్రేమలో పడతాడు. సహజ తండ్రి మొదట్లో ఒప్పుకున్నా ఆ తర్వాత ఒప్పుకోడు. దాని కారణం నాగశౌర్య ఊళ్ళో ఉన్న రంగబలి సెంటర్. అసలు ఆ రంగబలి సెంటర్ ఏంటి? దానికి ఆ పేరు ఎలా వచ్చింది? రంగబలి సెంటర్ కి, సహజ తండ్రికి, ఆ ఊరి ఎమ్మెల్యే (షైన్ టామ్ చాకో)కి ఉన్న సంబంధం ఏంటి? రంగబలి సెంటర్ తో శౌర్యకి ఉన్న అనుబంధం ఏంటి? ఆ గతం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాలసిందే.
రంగబలి సినిమా పంక్తు కమర్షియల్, కామెడీ ఎంటర్టైనర్. మొదటి భాగం అంతా కమర్షియల్ ఎలిమెంట్స్, కామెడీతో సాగుతుంది. రొటీన్ స్టోరీ అయినప్పటికీ సత్య కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయిస్తారు. ఎక్కడా కూడా బోర్ అనిపించకుండా ప్రథమార్థం సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మీద పెట్టిన ఫోకస్ సెకండాఫ్ మీద ఉండదేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రథమార్థం సాగినంత జోరుగా ద్వితీయార్ధం సాగదు. ఫ్లాష్ బ్యాక్ లో ఏదో ఉంది అనుకుని అంచనా వేస్తే అక్కడ అంత గొప్పగా ఏమీ ఉండదు. మంచిని వ్యాపిద్దాం, చెడుని విస్మరిద్దాం అన్న పాయింట్ తో దర్శకుడు మంచి సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు కానీ జనం రిసీవ్ చేసుకుంటారో లేదో చూడలి. క్లైమాక్స్ పర్వాలేదనిపిస్తుంది.
కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ కాబట్టి ప్రూవ్ చేసుకునే రేంజ్ సన్నివేశాలు లేవు. నాగశౌర్య ఎప్పుడూ చేసే పాత్రలే కాబట్టి కొత్తగా ఏమీ అనిపించదు. లుక్స్, బాడీ లాంగ్వేజ్ పరంగా ప్రతి సినిమాలో ఆకట్టుకున్నట్టే ఈ సినిమాలోనూ ఆకట్టుకున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో మరింత ఉత్సాహంగా కనిపిస్తారు. డాన్సులు, కామెడీలో మెప్పిస్తారు. హీరోయిన్ గా యుక్తి తరేజ పాత్ర సహజంగా ఉంటుంది. సెకండాఫ్ లో వచ్చే రొమాంటిక్ సాంగ్ లో యుక్తి గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇక ఎవరైనా సంతోషపడితే తట్టుకోలేని పాత్రలో సత్య చాలా బాగా కామెడీ పండించారు. హీరోయిన్ తండ్రి పాత్రలో మురళీ శర్మ, హీరో తండ్రి పాత్రలో గోపరాజు రమణ, ఎమ్మెల్యేగా షైన్ టామ్ చాకో, శుభలేఖ సుధాకర్, శరత్ కుమార్ తదితరులు బాగా నటించారు.
దివాకర్ మణి సినిమాటోగ్రఫీ బాగుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్, పవన్ సీహెచ్ సంగీతం ఆకట్టుకుంటాయి. పాటలు అంతగా గుర్తుండవు. ఆర్ట్ వర్క్, నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి. దసరా సినిమాకి నిర్మాతగా ఉన్న సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకి నిర్మాతగా పని చేశారు. కానీ ప్రొడక్షన్ వేల్యూస్ పరంగా దసరా సినిమాకి, రంగబలి సినిమాకి చాలా తేడా కనిపిస్తుంది.
చివరి మాట: రంగబలి ఒక కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్.. ఒకసారి చూడచ్చు.
రేటింగ్: 2.5/5