ఆహా ఓటీటీలో తాజాగా ప్రేక్షకుల్ని పలకరించిన వెబ్ సిరీస్ 'న్యూసెన్స్'. నవదీప్ నటించిన ఈ సిరీస్ ఎలా ఉందో తెలియాలంటే ఇంకెందుకు లేటు రివ్యూ చదివేయండి.
ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోయిన తర్వాత సినిమాలతో పాటు సిరీస్ లు చూడటం మనకు బాగా అలవాటైపోయింది. ఈ క్రమంలోనే తెలుగులోని దర్శకనిర్మాతలు చాలామంది ఒరిజినల్ సిరీసులు తీసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన వెబ్ సిరీస్ ‘న్యూసెన్స్’. నవదీప్, బిందుమాధవి.. ఇందులో లీడ్ రోల్స్ చేశారు. మీడియా-న్యూస్ కాన్సెప్ట్ ఆధారంగా తీసిన ఈ సిరీస్ తాజాగా ఆహా ఓటీటీలో విడుదలైంది. ఇది ఎలా ఉంది? ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిందా లేదా? అనేది తెలియాలంటే పూర్తి రివ్యూ చదివేయాల్సిందే.
ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లిలో శివ (నవదీప్) రిపోర్టర్. రిపబ్లిక్ న్యూస్ ఛానెల్ లో పనిచేస్తుంటాడు. ఆ ఏరియాలో జర్నలిస్టులందరూ కలిసి ఓ గ్రూప్ గా ఏర్పడతారు. రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు తీసుకుని తప్పుడు వార్తలు రాసిపారేస్తుంటారు. భూకబ్జాల దగ్గర నుంచి మిస్సింగ్ కేసుల వరకు దేన్ని వదలరు. ప్రతి న్యూస్ ని డబ్బు కోణం నుంచే చూస్తుంటారు. శివ కూడా ఇలాంటి వాటికి బాగా అలవాటుపడిపోతాడు. అంతా బాగానే ఉంటుంది కానీ కొన్ని రోజులకు అతడి లైఫ్ లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. కొందరు హత్యా ప్రయత్నం కూడా చేస్తారు. ఇంతకీ శివని చంపాలనుకున్నది ఎవరు? ఇందులో నీల(బిందుమాధవి), ఎస్ఐ ఎడ్విన్ (నందగోపాల్) పాత్రలేంటి? ఫైనల్ గా ఏం జరిగింది అనేది ‘న్యూసెన్స్’ కథ.
ఓ పేద రైతు కష్టపడి సాగు చేస్తున్న భూమిని రాజకీయ నాయకుడి మనుషులు కబ్జా చేస్తారు. అతడు ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్తే.. ‘ఇది నీ భూమి కాదు. పేపర్లు వాళ్ల పేరు మీద ఉన్నాయి’ అని చెప్తారు. పత్రికల్లో పడితే తనకు న్యాయం జరుగుతుందని ఆ పెద్దాయన.. జర్నలిస్టులు దగ్గరకి వెళ్తాడు. ఇదిగో అదిగో అని తిప్పుకుంటారు తప్పితే పని జరగదు. దీంతో ఆ రైతు.. తన పొలంలో తిష్ట వేసిన రౌడీల దగ్గరకు వెళ్తాడు. అతడిని అక్కడే చంపి పడేస్తారు. పురుగుల మందు తాగి చచ్చిపోయాడని జర్నలిస్టులతో న్యూస్ రాయిస్తారు. ఆ రైతు భార్య శివ(నవదీప్) దగ్గరకు వచ్చి.. ‘నా మొగుడు గురించి రాసింది మీరేనా సామీ.. మీ చేతుల్ని తాకొచ్చా సామీ.. ఏం లేదయ్యా.. నా మొగుడ్ని సంపిన సేతుల్ని ఓ తూరి చూసిపోదామని వచ్చినా’ అని చెప్పి ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఈ ఒక్క సీన్ తో ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్ ఏంటనేది క్లారిటీగా చెప్పేశారు. ఇదే కాదు ఇలాంటి సీన్స్ ఇందులో కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా చాలా నేచురల్ గా మనం కనెక్ట్ అయ్యేలా తీయడం విశేషం.
న్యూసెన్స్ గురించి చెప్పుకుంటే.. 1990-2000 మధ్య మదనపల్లె అనే ఊరిలో జరిగిన స్టోరీ. శివపై ఎటాక్ సీన్ తో ఫస్ట్ ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అసలు ఆ ఊరిలో రిపోర్టర్స్ ఎలా ఉంటారు? డబ్బులు తీసుకుని నిజాల్ని ఎలా దాచేస్తుంటారు లాంటి వాటిని ఒక్కొక్కటిగా చాలా నీట్ గా చెప్పుకుంటూ వెళ్లారు. శివతోపాటు నీల రిపోర్టర్ గా పనిచేస్తుంటుంది. వీళ్లద్దరి మధ్య చిన్న లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ప్రాబ్లమ్స్ ని రిపోర్టర్స్ ఎలా క్యాష్ చేసుకుంటున్నారు? అధికారి పార్టీలు రిపోర్టర్స్ ని ఎలా యూజ్ చేసుకుంటున్నాయ్, వారిలో ఎలాంటి పనులు చేయించుకుంటున్నాయ్ లాంటి అంశాల్ని ఇందులో చాలా క్లియర్ గా చూపించారు. ఆ రైతు సీన్ తోపాటు మరో సీన్ లో ఓ మహిళ భర్తని ఓ రాజకీయ నాయకుడు హత్య చేయిస్తాడు. కానీ ఆమెకు అక్రమ సంబంధం ఉండటం వల్లే అతడి చనిపోయాడని వార్త రాస్తారు. ఈ రెండు సీన్స్ చూస్తే.. రిపోర్టర్స్ మరీ ఇంత నీచంగా ఉంటారా అని కచ్చితంగా అనిపిస్తుంది.
సాధారణంగా మీడియాపై ఎవరూ పెద్దగా సినిమాలు తీయరు. ఒకవేళ తీసినా సరే సింపుల్ పాయింట్స్ ని అది కూడా కొన్నిసీన్ల వరకు మాత్రమే పరిమితం చేస్తుంటారు. అందుకేనేమో బహుశా.. ‘న్యూసెన్స్’ని సిరీస్ గా తీశారు. ఈ సీజన్ మొత్తం కూడా పాత్రల పరిచయానికి, స్టోరీ సెటప్ కోసం ఉపయోగించుకున్నారు. రెండో సీజన్ లో అసలు స్టోరీ ఏంటనేది ఉండబోతుంది. డైలాగ్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. అదే టైమ్ లో సగటు ప్రేక్షకుడిని ఆలోచింపజేశాయి. ఈ సీజన్ లో ప్రతి పాత్రకు సంబంధించి గ్రే షేడ్స్ మాత్రమే చూపించారు. ఈ సిరీస్ లో బిందుమాధవి తెలుగు పదాలు పలకడానికి ఇబ్బందిపడింది. ఐదో ఎపిసోడ్ చివరలో వచ్చే పాట, శివ మరదలు ట్రాక్ అనవసరం అనిపిస్తుంది. చివరి ఎపిసోడ్ లో చాలావరకు ఇంపాక్ట్ మిస్ అయింది. క్లైమాక్ల్స్ అయితే ఎండింగ్ లా కాకుండా మధ్యలో బ్రేక్ వేసినట్లు అనిపిస్తుంది. సినిమాల తరహా హీరోయిజం ఏం ఉండవు. సో అలాంటివి ఎక్స్ పెక్ట్ చేసి ఈ సిరీస్ ని అస్సలు చూడొద్దు.
‘న్యూసెన్స్’లో శివ పాత్రలో నవదీప్ బాగా నటించాడు. చిత్తూరు యాసలో డైలాగ్స్ బాగా చెప్పి ఆకట్టుకున్నాడు. నిజానికి, అబద్ధానికి మధ్య నలిగిపోయే సీన్స్ లో చాలా నేచురల్ గా చేసుకుంటూ వెళ్లిపోయాడు. నీల పాత్రలో బింధుమాధవి అందంతో ఆకట్టుకుంది. ఈ సీజన్ లో ఆమె యాక్టింగ్ కి పెద్దగా స్కోపు లేదు. బహుశా రెండో సీజన్ కోసం ఆమె సీన్స్ అన్నీ రాసిపెట్టుకుని ఉన్నట్లుంది. తిక్కలోడిగా కనిపించే పోలీస్ అధికారి ఎడ్విన్ పాత్రలో నందగోపాల్ యాక్టింగ్ తో కేక పుట్టించాడు. ఈ పాత్ర రాకతో సిరీస్ కి మంచి ఊపు వచ్చింది. మిగతా యాక్టర్స్ అందరూ కూడా పర్వాలేదనిపించారు. టెక్నికల్ విషయాలకొస్తే.. రైటింగ్ వల్ల ఒక్కో ఎపిసోడ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ వెళ్లారు. లీడ్ యాక్టర్స్ ఫెర్ఫార్మెన్స్ వల్ల ఈ సీజన్ లో పెద్దగా స్టోరీ ఏం లేకపోయినా ఆసక్తి వచ్చింది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్.. సిరీస్ కి ఎంత కావాలో అంతున్నాయి. సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా సరిపోయింది. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పుకుంటే.. ‘న్యూసెన్స్’ ఫస్ట్ సీజన్ బాగుంది. మీడియా-న్యూస్ తదితర అంశాలపై ఇంట్రెస్ట్ ఉంటే కచ్చితంగా ఓ సారి చూసేయొచ్చు. ఆరు ఎపిసోడ్స్ కలిపి 2 గంటల 40 నిమిషాలే ఉన్నాయి. కాబట్టి పెద్దగా టైమ్ కూడా పట్టదు.
చివరగా: మీడియా గురించి తెలిసినోళ్లకు మాత్రమే!
రేటింగ్: 2.5