మీకు థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టమా? అయితే ఈ మూవీని ట్రై చేయండి! గత కొన్నాళ్లలో థియేటర్లలో రిలీజ్ కు ఛాన్సులున్నా సరే కొన్ని మూవీస్ నేరుగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నాయి. అది వెబ్ సిరీస్ కావొచ్చు, సినిమా కావొచ్చు.. అల్టిమేట్ గా మనకు నచ్చిందా లేదా అనేదే పాయింట్. అలా తాజాగా ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజైన మూవీ ‘మోనికా ఓ మై డార్లింగ్’. బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావు, హ్యూుమా ఖురేషి, రాధికా ఆప్టే యాక్ట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉందనేది ఈ రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.
జయంత్(రాజ్ కుమార్ రావు) మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఓ రోబొటిక్ కంపెనీలో పనిచేస్తుంటాడు. బాగా కష్టపడి సొంతంగా ఓ రోబొట్ ని తయారు చేస్తాడు. అతడి పనిని మెచ్చిన సంస్థ యజమాని, కంపెనీలో కీలకపదవి ఇస్తాడు. సీఈఓ కూతురు నిక్కీ(ఆకాంక్ష రంజన్ కపూర్) కూడా జై అంటే ఇష్టపడుతూ ఉంటుంది. ఇద్దరూ లవ్ లో ఉంటారు. ఓవైపు నిక్కీని ప్రేమిస్తున్న జై, అదే కంపెనీలో పనిచేస్తున్న మోనికాతో(హ్యుమా ఖురేషి) ఎఫైర్ నడుపుతుంటాడు. ఇక జై, కంపెనీ బోర్డు మెంబర్ కావడంతో.. పర్సనల్ ఫొటోస్ తో మోనికా అతడిని బ్లాక్ మెయిల్ చేస్తుంది. దీంతో జై, అదే కంపెనీలో పనిచేస్తున్న మరో ఇద్దరితో కలిసి మోనికాని చంపాలని ప్లాన్ వేస్తాడు. మరి ఆ ముగ్గురు వేసిన ప్లాన్ ప్రకారం.. మోనికని చంపేశారా? ఈ క్రమంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే పూర్తి సినిమా చూసేయాల్సిందే.
మిగతా సినిమాలతో పోలిస్తే థ్రిల్లర్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే క్రైమ్ కామెడీ థ్రిల్లర్స్ కరెక్ట్ తీయాలే గానీ ప్రేక్షకుల్ని పక్కా ఎంటర్ టైన్ చేస్తాయి. ఆ తరహా సినిమానే ‘మోనికా ఓ మై డార్లింగ్’. డార్క్ థీమ్ లో సాగే ఈ సినిమాని పాము-నిచ్చెనల గేమ్ ని స్పూర్తిగా తీసినట్లు అనిపిస్తుంది. అందుకు తగ్గట్లే పాముల రిఫరెన్స్ కూడా చాలాచోట్ల కనిపిస్తుంది. ఇక స్టోరీ విషయానికొస్తే.. పాత్రల ఎంట్రీ, అసలు కథలోకి తీసుకెళ్లడానికి డైరెక్టర్ బాల కాస్త సమయం తీసుకున్నాడు. మోనికాను హత్య చేసొచ్చి రిలాక్స్ అయిన జైకు ఊహించని షాక్ ఎదురవుతుంది. ఇక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇక సెకండాఫ్ అంతా కూడా టర్న్ లు, ట్విస్టులు చాలా ఉంటాయి. అలా అని సీరియస్ గా ఏం ఉండదు. అవసరమైన ప్రతి చోట కామెడీగా ఉంటూనే థ్రిల్లింగ్ గా స్టోరీని డిజైన్ చేశారు.
మోనికాను జైతో పాటు మరో ఇద్దరు హత్య చేయాలని ప్లాన్ చేస్తారు. కానీ సిట్చూయేషన్స్ అన్నీ వాళ్లకు పూర్తి వ్యతిరేకంగా మారిపోతాయి. వాటిని హీరో తెలుసుకునే క్రమంలో చాలా కొత్త ట్విస్టులు ఉంటాయి. మరోవైపు జైతో పాటు హత్య చేద్దామనుకున్న కంపెనీ సీఈఓ కొడుకు, అదే కంపెనీలో పనిచేస్తున్న అకౌంటెంట్ హత్యకు గురవుతారు. జైని కూడా అలానే చంపేస్తారేమోనని ప్రేక్షకులు భయపడతారు. మరోవైపు ఏసీపీ విజయశాంతి నాయుడు(రాధికా ఆప్టే) ఇన్విస్టిగేషన్ చేస్తుంటుంది. ఇవన్నీ కూడా థ్రిల్లింగ్ గా చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ప్రారంభంలో కాస్త నెమ్మదిగా మొదలైన ఈ సినిమా.. మధ్యలో వేగం అందుకుంటుంది. చివర్లో చకాచకా చుట్టేసినట్లు కనిపిస్తుంది. ఇక ఈ సినిమా చివర్లో చూపించిన ఓ సీన్ తో సీక్వెల్ కూడా ఉంటుంది హింట్ ఇచ్చారు.
ఇక యాక్టింగ్ విషయానికొస్తే… రాజ్ కుమార్ రావు జై పాత్రలో అద్భుతంగా నటించాడు. చాలా నేచురల్ గా అలా అలా చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఇక జైని బ్లాక్ మెయిల్ చేసే మోనికా పాత్రలో హ్యుమా ఖురేషి కూడా ఆ రోల్ కి ఫెర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఏసీపీగా రాధికా ఆప్టే, అకౌంటెంట్ గా తమిళ నటుడు భగవతి పెరుమాళ్ తోపాటు మిగతా నటీనటులు తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. కాకపోతే థ్రిల్లర్ సినిమా అంటే చాలా ఫాస్ట్ గా వెళ్లాలి. కానీ ఈ సినిమా అక్కడక్కడా ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ సీన్ ఇంకాస్త బాగా తీర్చిదిద్దుంటే బాగుండేది అనిపిస్తుంది.
ఇక టెక్నికల్ విషయాలకొస్తే.. ముందుగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ అచింత్ టక్కర్.. ఓల్డ్ మెలోడీ థీమ్ లో మ్యూజిక్ ఇచ్చాడు. దీని వల్ల కొన్ని సీన్స్ మరింత ఎలివేట్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాలతో పోలిస్తే కాస్త డిఫరెంట్ గా ఉంది. స్వప్నిల్, సుఖేశ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా క్రేజీగా ఉంది. సరికొత్త అనుభూతి ఇచ్చింది. ఎందుకంటే డార్క్ థీమ్, లైటింగ్ ఎఫెక్ట్ సినిమాను డిఫరెంట్ గా చూపించాయి. ఎడిటింగ్ పరంగా ఓకే అయిప్పటికీ.. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా రిచ్ గా ఉన్నాయి. కొన్నికొన్ని సీన్లలో అదరగొట్టినప్పటికీ ఓవరాల్ గా చూస్తే మాత్రం డైరెక్టర్ వాసన్ బాలా మాత్రం పర్వాలేదనిపించారు. రెగ్యులర్ డ్రామా సినిమాలు కాకుండా ఓటీటీలో థ్రిల్లర్ సినిమా చూద్దామనుకుంటే మాత్రం దీన్ని ట్రై చేయొచ్చు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది.
చివరిమాట: డిఫరెంట్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చే థ్రిల్లర్ ఇది!
రేటింగ్: 2.5/5
(గమనిక: ఈ మూవీ రివ్యూ కేవలం సమీక్షుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)