మీక్కాబోయే శ్రీమతి ఇంటిపక్కనే ఉంటా.. మీరంటే నాకు నాకిష్టం

క్రైం డెస్క్- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అంతటా తెలిసిపోతుంది. తెలవడమే కాదు జరిగిన ఘటనకు సంబందించిన వీడియోలు, ఫోటోలు అంతటా వైరల్ అయిపోతున్నాయి. ఐతే డిజిటల్ మీడియా వల్ల మంచితో పాటు చెడు కూడా పొంచి ఉంది. చాలా మంది సోషల్ మీడియాను అసాంఘీక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. డిజిటల్ మీడియాను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో డిజిటల్ నేరాలు, ఘోరాలు పెరిగిపోయాయి. ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక సోషల్ మీడియా ద్వార అయిన కొన్ని పరిచయాలు పక్క దారి పడుతున్నాయి. ప్రధానంగా సోషల్ మీడియాలో పరిచయం అయిన అమ్మాయిలను కొంత మంది వేధింపులకు గురిచేస్తున్నారు.

cyber crime

ఇలా ఆన్ లైన్ లో పరిచయం అయిన ఓ అమ్మాయి పెళ్లి చెగొట్టాలని చూశాడో ప్రబుధ్దుడు. దీంతో చివరికి అతడు కటకటాలపాలయ్యాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తాండూరుకు చెందిన వంగ శివకుమార్‌ అలియాస్‌ నాని స్థానికంగా ఓ రెస్టారెంట్‌ ను నడుపుతున్నాడు. ఈ క్రమంలో అతనికి స్నాప్‌ చాట్‌లో ఒక యువతి ప్రొఫైల్‌ కనిపించగా ఆమెకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించాడు. దీంతో నాని ఫ్రెండ్ రిక్వెస్ట్ ను ఆ అమ్మాయి యాక్సెప్ట్‌ చేసింది. ఇంకేముంది ఆ తర్వాత ఇద్దరూ ప్రతి రోజు ఆన్‌ లైన్‌లో చాటింగ్‌లు చేసుకునేవారు. ఆ తర్వాత కొనని రోజులకు ఇద్దరు ఫోన్‌ నంబర్‌లు ఇచ్చిపుచ్చుకోవడం, ప్రతీరోజు ముచ్చట్లు పెట్టుకోవడం మామూలుగానే జరిగింది.

ఆన్ లైన్ పరిచయంతో ఇద్దరు మంచి స్నేహితులు అయ్యాక, ఆ యువకుడు ఆమెను చూడ్డానికి హైదరాబాద్‌ వచ్చాడు. ఉప్పల్‌లో ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకున్నారు. తమ ఫ్రెండ్ షిప్ కు గుర్తుగా ఇద్దరు కలిసి సెల్ఫీలు కూడా దిగారు. ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్లిపోగా, నాని నాగర్ కర్నూల్ వచ్చేశాడు. ఆ తరువాత కాసేపచికే ఆ అమ్మాయికి ఫోన్ చేసిన నాని, ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని మనసులో మాట చెప్పాడు. ఐతే అప్పటికే తనకు పెళ్లికుదిరిందని ఆ అమ్మాయి చెప్పింది. అంతే కాదు తనకు కాబోయే భర్త ఫొటోను, ఫోన్‌ నంబర్‌ను కూడా నానికి వాట్సాప్ ద్వార పంపించింది. ఐతే ఆ అమ్మాయి మీద మనసు పారేసుకున్న నాని,  ఎలాగైనా ఆమె పెళ్లి చెడగొట్టాలని భావించాడు. వెంటనే ఆ అమ్మాయికి కాబోయే భర్తతో తనను ఓ యువతిగా పరిచయం చేసుకున్నాడు.

ప్రతి రోజు అతనితో వాట్సాప్‌ చాటింగ్‌లు చేసేవాడు. నీకు కాబోయే భార్య ఇంటి పక్కన ఉంటానని, మీరంటే నాకు ఇష్టం అంటూ మెసేజ్‌లు పంపించేవాడు. ఈ క్రమంలో.. నీకు కాబోయే భార్యకు బోయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడని, అతడితో ఆమె దిగిన ఫొటోలు నా వద్ద ఉన్నాయంటూ వాటిని ఆ అమ్మాయికి కాబోయే వాడికి పంపించాడు. దీంతో ఆ అమ్మాయి పెళ్లి ఆగిపోతుందని భావించాడు నాని. ఐతే ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కొడుకు వెంటనే పెళ్లి కూతురుకు విషయం చెప్పేశాడు. ఆ అమ్మాయి ఏ మాత్రం ఆలస్యం చేసకుండా పోలీసులను ఆశ్రయించింది. ఏకంగా రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్‌ భగవత్‌ రంగంలోకి దిగి ఆదేశాలివ్వడంతో నానిని పోలీసులు అరేస్ట్ చేశారు. చూశారు కదా ఇలా ప్రేమ పేరుతో ఆ అమ్మాయి పెళ్లి చెడగొట్టాలని చూసిన నాని చివరకు కటకటాలపాలయ్యాడు.