ఇంటర్నెషనల్ డెస్క్- ఒకప్పుడు కారు లగ్జరీ వస్తువు. బాగా డబ్బులున్నవాళ్లకు స్టేటస్ సింబల్. కానీ రాను రాను కారు అవసరం అయిపోయింది. ఇప్పుడు ధనవంతులే కాదు, సామాన్యులు సైతం కారును వాడుతున్నారు. టాటా లాంటి కంపెనీలు లక్ష రూపాయలకే కారును అందుబాటులోకి తేవడంతో పాటు వందల కొద్ది కంపెనీల కార్లు భారత్ మార్కెట్ లోకి వచ్చాయి. ఐతే మన బడ్జెట్ ను బట్టి మామూలు నుంచి లగ్జరీ కార్లు అందుబాటులో ఉన్నాయి. బాగా డబ్బలు ఉన్నావాళ్లు, సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు ఐతే అత్యంత ఖరీదైన విదేశీ కార్లు వాడుతారు. ఎంత విదేశీ కారైనా మహా ఐతే ఓ పది కోట్ల రూపాయలు ఉంటుంది. పెరారీ, లాంబోర్గిని వంటి స్పోర్ట్స్ కార్లైతే 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఉండవచ్చు.
కానీ ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ రోల్స్ రాయిస్ ఇటీవల ఆవిష్కరించిన కారు ధర వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఎందుకంటే ఈ కారు ఖరీదు 2.8 కోట్ల డాలర్లు. అంటే మన ఇండియా కరెన్సీలో అక్షరాల 210 కోట్ల రూపాయలన్నమాట. రోల్స్ రాయిస్ తయారు చేసిన ఈ కొత్త కారు పేరు బోట్ టైల్. అయితే కారు ధరను అధికారికంగా వెల్లడించడానికి రోల్స్ రాయిస్ కంపెనీ నిరాకరించింది. కాని కారు ప్రత్యేకతలను బట్టి ధర ఆ స్థాయిలో ఉండవచ్చని ఆటో రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త కారును 1932 మోడల్ బోట్ టైల్ యజమానే స్వయంగా కొనుగోలు చేస్తున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. ఇక ఈ కారు 563 బీహెచ్‌పీతో 6.75 లీటర్ల ట్విట్ టర్బో వి12 ఇంజన్ కలిగి ఉటుంది. రెండు డోర్లు, నాలుగు సీట్లతో 5900 ఎంఎం పొడవు ఉందని కంపెనీ తెలిపింది.
కారు వెనుక వైపు రెండు ఫ్రిజ్‌లతో కూడిన పూర్తి స్థాయి హోస్టింగ్ సూట్ ను అమర్చారు. గతంలో 1920, 1930 దశాబ్దాల్లో ఇలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన కార్లు తిరుగుతూ ఉండేవట. 2017 ఆవిష్కరించిన కూపె స్వెప్టైల్ ప్రత్యేక లక్షణాలన్నీ బోట్ టైల్ లో ఉన్నాయని పేర్కొంది. ఐతే ఇలాంటి ప్రత్యేకమైన మోడల్ కార్లను కేవలం కస్టమర్ల కోరిక, అభిరుచి మేరకు మాత్రమే తయారు చేస్తామని రోల్స్ రాయిస్ తెలిపింది. కాబట్టి ఇలాంటి కార్లు మార్కెట్లోకి అందుబాటులోకి రావని అర్దమవుతోంది.