నాకు రాయిలా అడ్డు నిలబడ్డావు.. ఎమోషనల్ అయిన మోగా హీరో

ఫిల్మ్ డెస్క్- గత సంవత్సరం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ సమీపంలో, కేబుల్ వంతెన దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు కోలుకున్నాడు. వైద్యుల పర్యవేక్షణలో దాదాపు 3 నెలలకు పైగా విశ్రాంతి తీసుకున్న సాయి తేజ్ చికిత్స తీసుకుంటున్న సమయంలో ఇంటి పెద్దగా వ్యవహరిస్తూ అన్నీ తానై చూసుకున్నారు ఆయన తమ్ముడు, హీరో వైష్ణవ్ తేజ్. ఇదిగో ఇప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు సాయి ధరమ్ తేజ్.

గురువారం జనవరి 13న సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన సాయి ధరమ్ తేజ్, ట్విట్టర్‌ లో ఓ లేఖ పోస్ట్ చేశాడు. ఈ లేఖలో తమ్ముడిపై ఉన్న ప్రేమను బయటపెట్టాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తూ లైకులు కొడుతున్నారు.

Sai Dharam Tej 1 1

లేఖలో సాయి ధరమ్ తేజ్ ఏంచెప్పారంటే.. నా ప్రియమైన వైషూ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. గతేడాది నీ ఫస్ట్ ఫిలిం ఉప్పెన విడుదలై సూపర్ సక్సెస్ సాధించడం మనందరికీ ఎంతో సంతోషాన్నిచ్చింది.. అదే ఏడాది చివర్లో మన కుటుంబానికి పెద్దగా ఉంటూ నీ అన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు చూపించిన ప్రేమ, బాధ్యత ఎప్పటికీ మరువలేను.. నీకు అన్నయ్యను అయినందుకు చాలా సంతోషిస్తున్నా.. అని గత స్మృతులను గుర్తుచేసుకున్నారు.

ఎన్ని దెబ్బలు తగిలినా, ఇంకెన్ని ప్రశ్నలు ఎదురైనా, ఎన్నో రకాలుగా చర్చలు నడిచినా వాటన్నింటినీ తట్టుకొని ఎక్కడా షేక్ కాకుండా ఓ రాయిలా అడ్డు నిలబడ్డావు.. అలాగే నేను ఇంటికి రాగానే నీ కళ్ళలో చూసిన ఆ ఆనందం ఎంతో సంతృప్తినిచ్చింది.. నిన్ను చూసి మేము గర్విస్తున్నాం చిన్న తమ్ముడు. దేవుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నా.. అని చెప్పుకొచ్చారు సాయి ధరమ్ తేజ్. మొత్తానికి తమ్ముడి బర్త్ డే సందర్బంగా సాయి బాగా ఎమోషనల్ అయ్యాడు.