పెళ్లిళ్లకు, అంత్యక్రియలకు ఎవరి అనుమతి తీసుకోవాలి..

హైదరాబాద్- తెలంగాణలో ప్రస్తుతం లాక్ డౌన్ అమల్లో ఉంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే లాక్ డౌన్ నుంచి సడలింపు ఉంటుంది. కేవలం ఈ నాలుగు గంటలు మాత్రమే మనం బయటకు వెళ్లి మనకు కావాల్సినవి కొనుక్కోవాలి. ఐతే లాక్ డౌన్ సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు, అంత్యక్రియలకు ప్రభఉత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలయాలకు 40 మంది, అంత్యక్రియలకు 20 మంది హాజరుకావొచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐతే వీటికి ముందస్తు అనుమతి తప్పకుండా తీసుకోవాలి. ఇంతవరకు బాగానే ఉన్నా.. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు ఎవరి నుంచి అనుమతి తీసుకోవాలన్నదానిపై క్లారిటీ లేదు. జనాలకే కాదు ప్రభుత్వ అధికారులకు కూడా ఈ విషయంపై సరైన సమాచారం లేదు. దీంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బందిలో అయోమయం నెలకొంది.

వివాహాలు, అంత్యక్రియల అనుమతి కోసం ఎవరికి ధరాఖాస్తు పెట్టుకోవాలన్నదానిపై సరైన సమాచారం లేకపోవడంతో జనం తికమకపడుతున్నారు.  ముందు స్థానిక పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలా, లేదంటే రెవెన్యూ కార్యాలయం నుంచి ఎమ్మార్వో అనుమతి తీసుకోవాలా అన్నదానిపై క్లారిటీ లేదు. ఇక అధికారులు సైతం తనకు ప్రభుత్వం నుంచి సరైన మార్గదర్శకాలు లేవని చెబుతున్నారు. అందుకే పెళ్లిళ్లు, అంత్యక్రియల అనుమతి కోసం వచ్చినవారి ధరఖాస్తులను తీసుకుని వాటిపై స్టాంప్ వేసి ఇచ్చి పంపిస్తున్నారు. కానీ ఆయా సమయంలో వెళ్లి ఎంత మంది హాజరయ్యారు, నిబంధనలు ఫాలో అయ్యారా లేదా అన్నది ఎవరు తనిఖీ చేయాలన్నదానిపై పోలీసులకు, రెవెన్యు అధికారులకు క్లారిటీ లేదట. ఇలా ఉంది మరి పరిస్థితి.