భారత్ కి మరో ముప్పు! దూసుకొస్తున్న తౌక్టే తుఫాన్ !

thufanకరోనాతో కకావికలం అవుతున్న భారత్ కి మరో ముప్పు సవాలు విసరబోతుంది. ఇప్పటికే భయం గుప్పిట్లో బతుకుతున్న ప్రజలను ఇంకాస్త వణికిస్తూ.., ఇండియాపైకి భారీ తుఫాన్ దూసుకొస్తోంది. దేశంలోని తీర ప్రాంతాలను అతలాకుతలం చేయడానికి తౌక్టే తుఫాన్ వాయువేగంతో సిద్ధమవుతోంది. . ‘తౌక్టే’ అనే పేరును మయన్మార్ ఎంపిక చేసింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి.. క్రమంగా వాయుగుండంగా మారింది. ఈ విషయాన్ని వాతావరణ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. దీనితో ఈ వాయుగుండం ఈ నెల 16 నుంచి 18వ తేదీ నాటికి పెను తుఫాన్గా మారుతుందని హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం గుజరాత్, కేరళ రాష్ట్రాలపై అధికంగా కనిపిస్తోంది. కేరళలోని దక్షిణ ప్రాంత జిలాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్ లోని తీర ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితిలే నెలకొన్నాయి. దీనితో ఈ రెండు రాష్ట్రాల అధికార యంత్రాంగాన్ని వాతావరణ శాఖ ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఈ నెల 18 నాటికి గుజరాత్ దగ్గర తీరం వద్ద తౌక్టే తుఫాన్ తీరం దాటుతుందని.. అయితే.., అది ఎక్కడ అన్నది కచ్చితంగా చెప్పలేమని వాతావరణ శాఖ అధికారులు తెలియచేశారు.

తౌక్టే తుఫాను దక్షిణ భారతదేశంలోని మిగతా రాష్ట్రాలపై కూడా కొంత వరకు ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ, రాయలసీమ, దక్షిణ తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకూ ఉత్తర దక్షిణ ద్రోణి వ్యాపించి ఉంది. దీని కారణంగా రానున్న 48 గంటల్లో బంగాళాఖాతం నుంచి తేమ గాలులు వీచే అవకాశం ఉంది.ఇక మూడు రోజుల పాటు రాయలసీమలో జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశంకూడా లేకపోలేదు. ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. గత 24 గంటల్లో అనంతపురం జిల్లా కుందుర్పిలో 4 సెం.మీ, కల్యాణదుర్గం, రాయదుర్గం, సెత్తూరులో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెల 15, 16న తేదీల్లో ఇంకా ఎక్కువచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే.., ఈ తుఫాన్ నైరుతి రుతుపవనాల రాకపై అస్సలు ప్రభావం చూపించదని నిపుణులు పేర్కొన్నారు. రుతుపవనాలు సాధారణంగా జూన్ రెండో వారంలో రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. తౌక్టే తుఫాను ప్రభావం అప్పటికి పూర్తిగా తగ్గిపోతుంది. దీనితో.. ఈసారి రెండు మూడు రోజుల ముందే రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే సూచనలు కనిపిస్తున్నాయి.