కొడుకు మరణాన్ని తట్టుకోలేపోయిన ఓ తల్లి.. చావు విషయం ఎవరికి చెప్పకుండా శవం పక్కనే విలపిస్తూ ఉండిపోయింది. దుర్వాసన వస్తుండంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు వెళ్లి చూడగా విషయం తెలిసింది. కొడుకు మరణాన్ని భరించలేక అక్కడిక్కడే కూప్పకూలిపోయి, మళ్లీ తెరుకుని అలాగే విలపిస్తూ మూడు రోజులు గడిపిన ఆ తల్లి బాధ అక్కడున్న వారి చేతకన్నీరు పెట్టించింది.
ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ఫత్తేఖాన్ పేట తామరవీధిలో జరిగింది. అక్కడ నివాసముండే వెంకటరాజేష్(37)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. అభిప్రాయభేదాలతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో రాజేష్, అతని తల్లి విజయలక్ష్మి మానసికంగా కుంగిపోయారు. తనను ఆలస్యంగా నిద్రలేపమని ఈ నెల 5వ తేదీ రాత్రి రాజేష్ నిద్రపోయాడు. మరుసటి రోజు సాయంత్రానికి కూడా రాజేష్ నిద్రలేవకపోవడంతో విజయలక్ష్మి బలవంతంగా నిద్రలేపిన లేవలేదు. దీంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. కొడుకు మరణ వార్తను ఎవరికీ చెప్పకుండా అక్కడే మౌనంగా ఏడుస్తూ కూర్చుంది. మూడు రోజులకు దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల వచ్చి చూడగా కుళ్లిన శవం పక్కన విజయలక్ష్మి రోదిస్తూ ఉంది. పోలీసులు ఆమెను సముదాయించి, శవాన్ని పోస్టుమార్టానికి తరలించారు.