గులాబ్ తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్ర ప్రజలను వణికిస్తుంది. ఆదివారం రాత్రి తీరం దాటిన ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కుంభవృష్టి, మంగళవారం, బుధవారం భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.
తుపాన్ కారణంగా రాబోయే మూడు రోజుల్లో హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిస్థితిపై సమీక్షించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. గతేడాది అనుభవాలు దృషిలో ఉంచుకొని వరద సహాయానికి బోట్స్, పంపులు, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. అవసరమయ్యే ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు.
ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు :
గులాబ్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పూసపాటిరేగ, గజపతినగరం, నెల్లిమర్ల మండలాల్లో 10 సెం.మీ. పైగా వర్షపాతం నమోదయ్యింది. భోగాపురం మండలంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీవర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో భారీవర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. సోమవారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.