ఘనంగా రవితేజ “రావణాసుర” సినిమా ప్రారంభం

వరుస సినిమాలతో ఫుల్‌ జోష్‌ మీద ఉన్నారు మాస్‌ మహారాజా రవితేజ. ఆయన హీరోగా అభిషేక్ ఫిల్మ్స్ పతాకంపై సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామ నిర్మిస్తోన్న చిత్రం కొత్త చిత్రం రావణాసుర. ఈ చిత్రం జనవరి 14న బోగి సందర్భంగా సినీ, రాజకీయ నాయకుల మధ్య అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత వైభవంగా ప్రారంభమయింది. పూజా కార్యక్రమాలు అనంతరం రవితేజపై ముహూర్తపు సన్నివేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి క్లాప్ ఇచ్చారు.

సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రముఖ దర్శకులు కేఎస్ రవీంద్ర(బాబీ), గోపీచంద్ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు. కార్యక్రమంలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు, రామ్మోహన్ రావు పాల్గొన్నారు. శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరో సుశాంత్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా, అను ఇమ్మాన్యూల్‌, మేగా ఆకాష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జనవరి 17 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.