చరిత్రలో మరుగున పడిన విషయాలను సమాజానికి తెలియజెప్పడానికి కొంత మంది దర్శకులు సినిమాల రూపంలో అందిస్తారు. పురాణాల్లో చెప్పబడిన విషయాలను, ఈ నేలయొక్క గొప్పతనాన్ని నేటి తరానికి అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల నుంచి ముఖ్య ఘట్టాలను తీసుకుని తెరకెక్కించిన విషయం తెలిసిందే. రామాయణ గాధను నేటి తరానికి అందించడానికి దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ద్రవిడ భూమియొక్క ఆత్మగౌరవ నినాదంతో కోడ్ రామాయణ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది.
ఫేమస్ రైటర్ సౌద అరుణ దర్శకత్వంలో సౌద అరుణ స్టూడియోస్ పతాకంపై కోడ్ రామాయణ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇది ద్రవిడ భూమి ఆత్మ గౌరవ నినాదంతో రానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో గ్రాండ్ గా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి బౌద్ద బిక్షువు బంతె షీల్ రక్షిత్, ప్రముఖ రచయిత్రి పి. లలిత హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా కోడ్ రామాయణ ఫస్ట్ లుక్ పోస్టర్ ను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సౌద అరుణ మాట్లాడుతూ.. ద్రవిడ నేల యొక్క గొప్పతనాన్ని ప్రపంచం ముందుకు తీసుకురావాలని మాత్రమే ఈ సినిమా చేస్తున్నామని, ఏ ఒక్క వర్గానికి వ్యతిరేకంగా దీన్ని తీయడం లేదని చెప్పారు. సంగీత సాహిత్యాలతో విరాజిల్లిన గడ్డే ద్రవిడ భూమి అని, ఈ గడ్డపై జన్మించిన మేము జై శ్రీ రావణ అని స్మరించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఇక ఈ సినిమాలో దుర్వాసుడు పాత్రలో నటించిన భరద్వాజ మాట్లాడుతూ.. కోడ్ రామాయణ అంటే రామాయణ అంతరార్థం తెలియజేస్తుందని తెలిపారు. ఏ సందేశం ఇవ్వడం కోసం రామాయణం వచ్చిందనేది దీని ముఖ్య ఉద్దేశ్యం అని చెప్పారు. ఆయన రామాయణాన్ని మూడు భాగాలుగా చెప్పడం జరిగింది. తొలి భాగం పూర్వ రామాయణం, రెండవ భాగం రావణ చరిత్ర, మూడవ భాగం ఉత్తర రామాయణం. రెండవ భాగం రావణ చరిత్రలో రావణ పాత్ర గురించి ప్రధానంగా ఉంటుందని తెలిపారు. కోడ్ రామాయణ కు సంబంధించి మొదటి భాగం పూర్తయ్యిందని తెలిపారు. ఈ సినిమా విడుదల అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవికి చూపించి రెండవ భాగంలో వచ్చే రావణాసుర పాత్ర కోసం చిరంజీవిని సంప్రదిస్తామని భరద్వాజ అన్నారు. జై శ్రీ రావణ్ పేరుతో ద్రవిడ భూమి ఆత్మగౌరవ నినాదంతో తెరకెక్కుతున్న కోడ్ రామాయణ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.