తల్లి జన్మనిస్తే.. తండ్రి జీవితాన్ని ఇస్తాడు. తల్లి నవమాసాలు కొడుకుని కడుపులో పెట్టుకుని మోస్తే.. తండ్రి ఆ కొడుకుని కళ్ళలో పెట్టుకుని పాతికేళ్ళు చూసుకుంటాడు. అప్పటికీ ప్రయోజకుడు అవ్వకపోతే శక్తి ఉన్నంత వరకూ కంటికి రెప్పలా చూసుకుంటాడు. నాన్న ప్రేమంటే అదే. నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. పిల్లలు పుట్టిన తర్వాత తన ఇష్టాలను, కోరికలను అన్నీ వదిలేసుకొని.. పిల్లల ఇష్టాలు, కోరికలే తన లక్ష్యంగా బతుకుతాడు. ఎన్ని చేసినా, ఎంత చేసినా ఎందుకో నాన్న వెనకబడిపోతాడు. మగాడు అయిన కారణంగా వెనకబడిపోయాడు. జన్మనిచ్చిన తల్లికి ఎలా అయితే రుణపడి ఉంటారో, అలానే జీవితాన్నిచ్చిన తండ్రికి కూడా రుణపడి ఉండాలి. రుణపడి ఉండే కొడుకులు కూడా ఉంటారు.
ఏరోజూ తండ్రికి చేతులెత్తి దండం పెట్టని కొడుకులున్న ఈ సమాజంలో.. తండ్రి చనిపోతే ఏదో సాకు చెప్పి పిండం పెట్టలేని కొడుకులు ఉన్న ఈ సమాజంలో తండ్రి మీద ప్రేమతో గుడులూ, బడులూ కట్టే గొప్ప మనసున్న కొడుకులు ఉంటారు, ఉన్నారు కూడా. నిజామాబాద్ జిల్లాలోని మల్కాపూర్ తండాకి చెందిన గంగారాం నాయక్ కి ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుర్లు ఉన్నారు. కొడుకుల పేర్లు రావోజీ నాయక్, సక్రియ నాయక్. వీళ్ళందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. గంగారాం నాయక్.. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. 2014 డిసెంబర్ 30న గంగారాం నాయక్ మృతి చెందారు. తండ్రి మృతిని జీర్ణించుకోలేకపోయారు కొడుకులు. నాన్న మీద ప్రేమతో సొంత పొలంలో రూ. 5 లక్షలు ఖర్చు పెట్టి మరీ గుడి కట్టించారు. గుడిలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
ప్రతీ ఏటా డిసెంబర్ 30న వర్థంతి కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులందరూ హాజరవుతారు. ఇప్పటికీ వీరందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈరోజుల్లో ఉమ్మడి కుటుంబం అంటే మామూలు విషయం కాదు. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వీళ్ళని చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బతికున్నప్పుడు అన్నం పెట్టాలి. దణ్ణం పెట్టాలి. బతికి ఉన్నప్పుడు నాన్న విలువ తెలియదు. లేనప్పుడే ఆ విలువ, వెలితి ఏంటో తెలుస్తుంది. కాబట్టి బతికున్నప్పుడే నాన్నకి అన్నీ ఇచ్చేయాలి. పిల్లల కోసం తన జీవితంలో అన్నీ త్యాగం చేసిన తండ్రి కోసం పిల్లలు స్థిరపడ్డాక తండ్రికే తండ్రి అవ్వాలి.
కొడుకులు బాల్యంలో ఉన్నప్పుడు తండ్రి కోల్పోయిన అనుభూతులను, తండ్రి కలలను, ఆశయాలను.. కొడుకులు ఎదిగిన తర్వాత తండ్రి స్థానంలో ఉండి ఇవన్నీ నెరవేర్చాలి. అప్పుడే కదా జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. ఈ జీవిత చక్రం చాలా గమ్మత్తుగా ఉంటుంది. పిల్లలు పుట్టినప్పుడు తోడుగా తల్లిదండ్రులు ఉంటారు. మరి వాళ్ళు పసిపిల్లలు అయినప్పుడు పిల్లలు కూడా తోడుగా ఉండాలిగా. మరి మీరేమంటారు. మీ తల్లిదండ్రుల మీద మీకు ఎంత ప్రేమ ఉంది? మీ తల్లిదండ్రుల కోసం మీరేం చేయాలనుకుంటున్నారు? తండ్రి కోసం గుడి కట్టిన ఈ ఉత్తమ కుమారులపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి