చాలా మంది మహిళలు కుటుుంబ బాధ్యతలు ఓ వైపు చూస్తూనే.. ఉద్యోగం సాధించాలనే తపనతో ఉంటారు. రెండింటితో ఎంతో మంది యువతులు, మహిళలు లక్ష్యం సాధించే దిశగా అడుగులు వేస్తారు. అనేక సందర్భాల్లో అలాంటి వారికి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం అవతలి వ్యక్తులు వారి పాలిట దేవుళ్లలా మారతారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఆదివారం పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం ప్రిలిమినరీ రాత పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు ఓ అమ్మ.. తన పసిబిడ్డతో హాజరైంది. కానీ.. పిల్లాడిని చూసుకునేందుకు ఎవరూ లేరు. ఇంతలోనే ఓ పోలీస్ ఆఫీసర్ దేవతలా వచ్చి.. ఆదుకుంది.
సుల్తాన్ బజార్ సీఐ పద్మ.. ఆ మహిళ సమస్యను అర్ధం చేసుకుని.. ఆ పిల్లాడిని తన దగ్గరకు తీసుకుంది. సీఐ పద్మ చిన్నారిని ఆడిస్తూ ఉంది. ఈక్రమంలో ఆ చిన్నారితో సీఐ పద్మ ఫోటో దిగింది. ‘అమ్మ పరీక్ష హాల్లో.. నేను పోలీస్ ఫ్రెండ్స్ తో’ అని క్యాప్షన్ పెట్టి ట్వీట్ చేసింది. పోలీస్ పరీక్షలో భాగంగా ఒక మహిళ పరీక్ష రాస్తుంటే.. ఆమె పిల్లాడిని తన ఒడిలో క్షేమంగా చూసుకున్నానని సీఐ పద్మ వెల్లడించింది. సీఐ చేసిన పనిని పోలీస్ ఉన్నతాధికారులు ప్రశంసించారు. ఒక అమ్మ మనసు.. ఇంకో అమ్మకే తెలుస్తుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.