ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల వ్యూహాలను అమలుపరుస్తుంటారు.
ఎన్నికల సమయంలో నేతలు ప్రజలకు ఎన్నో రకాల హామీలు ఇస్తుంటారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అధికార, ప్రతిపక్ష నేతలు ఎన్నో రకాలుగా ఎత్తకు పై ఎత్తులు వేస్తుంటారు. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పోటీలు పడి ఖర్చులు కూడా చేస్తుంటారు. తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష నేతలు పోటా పోటీగా యువతకు గాలం వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. పలు పార్టీ నేతలు ఓటర్లను ఆకర్షించుకునేందుకు ఇప్పటి నుంచి రక రకాల వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. దుబ్బాక నియోజకవర్గ పరిధిలో యువతను ఆకర్షించే పనిలో పడ్డారు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. ఈ క్రమంలోనే నియోజకవర్గ యువతీ, యువకులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీంతో చాలా మంది యువత ఎమ్మెల్యే, ఎంపీ కార్యాలయాల చుట్టూ క్యూ కడుతున్నారు. ఇంతకీ ఈ నేతలు ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? ఉచత డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్.
దుబ్బాయ నియోజకవర్గంలో 18 సంవత్సరాల వయసు నిండిన యువతీ, యువకులకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ మేరకు స్థానిక యువతీయువకులకు టూ వీలర్ లైసెన్స్ కోసం తన కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ఇంకేముంది ఎమ్మెల్యే పిలుపు మేరకు పెద్ద ఎత్తున యువత ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ కి తరలివచ్చారు. ఈ విషయం గురించి తెలుసుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి టూ వీలర్ లైసెన్స్ తో పాటు ఫోర్ వీలర్ లైసెన్స్, దీనితో పాటు ఒక హెల్మెట్ కూడా ఇస్తాం అని ప్రకటించారు.
మొత్తానికి తెలంగాణలో దుబ్బాక నియోజకవర్గంలో ఉచిత లైసెన్స్ సందడి కొనసాగుతుంది. వాస్తవానికి టూ వీలర్ లైసెన్స్ పొందాలంటే ప్రభుత్వ ఫీజు ప్రకారం రూ.300 ఉండగా, రూ.750 రూపాయాలు పర్మినెంట్ లైసెన్స్ కి తీసుకుంటారు. అలాగే టూవీలర్ తో పాటు ఫోర్ వీలర్ లైసెన్స్ కావాలంటే 450 రూపాలు తీసుకుంటారు. పర్మినెంట్ లైసెన్స్ కి 1400 రూపాయలు తీసుకుంటారు. అలాంటి ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా లైసెన్స్ వస్తుందని తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల యువత సైతం అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కార్యాలయానికి 12 వేలు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కార్యాలయానికి 13,411 వేల దరఖాస్తులు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.