మనలో చాలా మందికి టెన్నిస్ గురించి పెద్దగా తెలీదు. కానీ ఆడే కొందరు ప్లేయర్స్ గురించి మాత్రం తెలుసు. అలాంటి వారిలో సానియా మీర్జా ఒకరు. టెన్నిస్ ప్లేయర్ గా అద్భుతాలు చేసిన ఈమె.. గ్లామర్ విషయంలోనూ హీరోయిన్లకు పోటీ ఇచ్చేది. అప్పట్లో ఈమె క్రేజ్ అలా ఉండేది. ఆ తర్వాత పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని పెళ్లి చేసుకున్న ఈమె.. చాలామందికి షాకిచ్చింది. దాదాపు 12 ఏళ్లుగా అన్యోన్యంగా ఉన్న వీరి బంధం.. ఇప్పుడు విడాకుల వరకు వచ్చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సానియా మీర్జా టెన్నిస్ ప్లేయర్. షోయబ్ మాలిక్ పాక్ క్రికెటర్. వీరిద్దరికి 2003 నుంచి పరిచయం. కానీ బయట ఎవరికీ పెద్దగా తెలీదు. 2009లో పెళ్లి ప్రస్తావన రాగా.. దేశ సరిహద్దులు చెరిపేస్తూ తర్వాత ఏడాది అంటే 2010లో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఇక భారత్-పాక్ మ్యాచ్ లు ఎప్పుడు జరిగినా సరే స్టేడియంకి వచ్చి భర్తకు సానియా సపోర్ట్ చేసేది. భారత జట్టు కూడా గెలవాలని కోరుకునేది. బెస్ట్ కపుల్ గా ఈ జంటకు మంచి పేరు కూడా ఉంది. 2018లో వీళ్లకు ఇజాన్ మీర్జా అనే అబ్బాయి పుట్టాడు. తాజాగా ఆ పిల్లాడి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే సానియా-సోషబ్ విడాకుల గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు.
సానియా మీర్జా.. ఈ మధ్య కాలంలో ఇన్ స్టాలో కొన్ని పోస్టులు పెట్టింది. ఇవన్నీ చూస్తుంటే.. విడాకుల వార్త నిజమేనేమో అనిపిస్తోంది. తన కొడుకు ఇజాన్ ఫొటో షేర్ చేసిన సానియా.. కష్ట సమయాల్లో తీసుకున్న క్షణాలు అని రాసుకొచ్చింది. అంతకు ముందు మరో పోస్టులో బ్రేకప్ హార్ట్ సింబల్స్ ఎక్కడికి వెళ్తాయి? అని క్యాప్షన్ పెట్టింది. ఇక ఇజాన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. దుబాయిలో ఈ మధ్య గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోల్ని షోయబ్ ఇన్ స్టాలో పోస్ట్ చేసినప్పటికీ.. సానియా మాత్రం ఒక్కటంటే ఒక్క ఫొటో కూడా పోస్ట్ చేయలేదు. దానికి తోడు.. సానియా-షోయబ్ ప్రస్తుతం వేర్వేరుగా ఉంటున్నారని, త్వరలో విడాకులు తీసుకోనున్నారని పాక్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ రూమర్స్ మాత్రమేనని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై క్లారిటీ రావాలంటే వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాలి. అప్పటివరకు అసలు విషయం బయటకు రాదు.