స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, స్మార్ట్ రింగులు కూడా వస్తున్నాయి. అయితే లైఫ్‌లోకి ఎన్ని ఎక్కువ స్మార్ట్ గ్యాడ్జెట్స్ వస్తాయో.. అంత ఎక్కువ ఈజీ లైఫ్ లీడ్ చేయచ్చు అంటారు. అయితే అంతే ఈజీగా మీ బ్యాంక్ ఖాతాకు, మీ వ్యక్తిగత జీవితానికి నష్టం జరుగుతుందని తెలుసా? మీరు చాలాసార్లు న్యూస్‌లో చూసే ఉంటారు. ఫోన్ కాల్ చేసి ఖాతా ఖాళీ చేశారు అని. అయితే ఇప్పుడు టెక్నాలజీ పరుగులు పెడుతోంది. అలాగే హ్యకర్లు కూడా వారి పద్ధతులు మార్చుకున్నారు. చిన్న 10 కేబీ బాట్ వైరస్‌ని మీ ఫోన్‌లోకి పంపితే చాలు. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీ పాస్‌వర్డ్స్, మీ కాల్ హిస్టరీ, కాంటాక్ట్స్, గ్యాలరీ ఇలా మీ స్మార్ట్ ఫోన్ మొత్తం హ్యాక్ అయిపోతుంది. వేరే వాళ్లు ఆ సమాచారంతో ఏదైనా చేయచ్చు. అయితే ఫోన్ హ్యాక్ అయ్యిందని ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు చూద్దాం.
మీ ఫోన్‌ని సాధారణంగా ఎంతసేపు వాడాం. ఎంత సమయం ఛార్జింగ్ పెట్టాం అనే విషయాలు మీకు బాగా తెలుసు. అయితే గతంలో 10 గంటలపాటు ఛార్జింగ్ బ్యాకప్ ఇచ్చిన ఫోన్ ఇప్పుడు 5 గంటలకే ఛార్జింగ్ అయిపోతుంది. పడుకునే సమయంలో మీ ఫోన్‌కి 80శాతం ఛార్జింగ్ ఉంటే లేచే సరికి అది 20శాతానికి పడిపోతుంది. మీరు ఫోన్‌ని వాడకపోయినా కూడా ఫోన్ హీట్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఫోన్ వాడుతున్నప్పుడు సంబంధం లేని యాప్స్ అన్నీ స్క్రీన్ మీదకు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఫోన్ హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. ఫోన్ కూడా చాలా స్లోగా వర్క్ అవుతూ ఉంటుంది. అయితే ఫోన్ కొని రెండు మూడేళ్లు దాటితే సాధారణంగానే ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.
అదే సంవత్సరంలోపు ఉన్న ఫోన్‌లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే కచ్చితంగా అనుమాన పడాల్సిందే. కొన్నిసార్లు ఫోన్ దానంతట అదే రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. మీకు తెలియకుండానే బ్యాగ్రౌండ్‌లో యాప్స్ వర్క్ అవుతూ ఉంటాయి. ఇలాంటి కొన్ని బాట్ వైరెస్‌లు ఎలా ఉంటాయి అంటే.. మీరు చేసే ప్రతి యాక్టివిటీని రికార్డ్ చేసి హ్యాకర్లకు పంపుతూ ఉంటా. అది వాళ్లు నిర్దేశించిన సమయం ప్రకారం జరుగుతుంది. మీరు టైప్ చేసే ప్రతి మెసేజ్, ప్రతి పాస్‌వర్డ్, మీ గ్యాలరీలోని ప్రతి ఫొటోని కూడా వాళ్లు యాక్సెస్ చేయగలరు. ఇలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా లేకపోతే మీ ఖాతాలు మొత్తం ఖాళీ అయిపోతాయి. అయితే అసలు ఎలా హ్యాక్ చేస్తారు? అనే ప్రశ్న కూడా వస్తుంది.
ఈ హ్యాకర్లు ఆన్‌లైన్‌లో ఫేక్ లింకులు పోస్ట్ చేస్తూ ఉంటారు. కొందరికి వాట్సాప్‌లో కొన్ని లింకులు ఫార్వార్డ్ చేస్తుంటారు. ఆ మెసేజ్ మీద క్లిక్ చేసినా కూడా వైరస్ ఫోన్‌లోకి వస్తుంది. ఫోన్ హ్యాక్ అయిందనే అనుమానం ఉంటే.. ముందుగా గూగుల్ సెక్యూరిటీలోకి వెళ్లి ఫోన్‌ని స్కాన్ చేయాలి. అక్కడ ఎలాంటి వైరస్ ఫౌండ్ కాలేదు అంటే ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ, నూటికి నూరుశాతం గ్యారెంటీ అన్నట్లు కాదు. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ చాలానే ఉన్నా కూడా వాటికి గ్యారెంటీ లేదు. మీ పర్సనల్ ఫొటోలు, మెయిల్స్ అన్నీ బ్యాకప్ తీసుకుని ఫోన్‌ని రీబూట్ చేయడం ఉత్తమం. ఆ తర్వాత వెంటనే మీ బ్యాంక్ అకౌంట్స్, యూపీఐ ఐడీ పాస్‌వర్డ్స్, మెయిల్ పాస్‌వర్డ్స్ అన్నీ మార్చుకోవాలి. తర్వాత కూడా అలాంటి మార్పులు కనిపిస్తూ ఉంటే మంచి టెక్ ఎక్స్ పర్ట్‌ని లేదా టెక్ అసిస్టెంట్లని కలవడం మంచిది.