స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎవరి దగ్గర చూసినా స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. అయితే కొనుగోలు చేసినంత తేలిక కాదు.. స్మార్ట్ ఫోన్ వాడటం. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి వాడటం అనేది అత్యంత ప్రమాదకరం. అలా చేయడం వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో చూడండి.
ఇప్పుడు చాలా మంది స్మార్ట్ ఫోన్ లేకుండా నిద్ర పోలేరు.. లేవగానే స్మార్ట్ ఫోన్ లేకపోతే రోజు గడవదు. కళ్లు తెరిచి ఉన్నంతసేపు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. చాలా మంది ఈ స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారు. ఎంతలా అంటే ఛార్జింగ్ లేకపోతో.. ఫోన్ ఛార్జర్ కి తగిలించేసి వాడేస్తుంటారు. దాని వల్ల ఎంత ప్రమాదమో గ్రహించడం లేదు. ఇప్పటికే ఇలా చేయడం వల్ల స్మార్ట్ ఫోన్లు పేలి చాలా ప్రమాదాలు జరిగాయి. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే అసలు స్మార్ట్ ఫోన్ ని ఛార్జింగ్ పెట్టి వాడటం వల్ల కలిగే నష్టాలేంటి? మీరు ఎందుకు స్మార్ట్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి వాడుకూడదు? అనే విషయాలు తెలుసుకోండి.
సాధారణంగానే స్మార్ట్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టడం వల్ల అది హీటవుతూ ఉంటుంది. ఛార్జింగ్ పూర్తైన తర్వాతే అది చిన్నగా సాధారణ స్థితికి వస్తుంది. పైగా ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అంటూ అరగంటలోనే బ్యాటరీ ఫుల్ అవుతుందని చెబుతున్నారు. ఎంత స్పీడుగా ఫోన్ ఛార్జ్ అవుతుందో.. ఫోన్ అంతే వేడెక్కుతూ ఉంటుంది. ఈలోపు మీరు ఫోన్ వాడుతున్నారనుకోండి.. ఆ ఫోన్ మరింత వేడవుతుంది. అలా హీటవుతున్న ఫోన్ ని వాడటం ఎంతో ప్రమాదం.
మనిషి శరీరానికి రేడియేషన్ మంచిది కాదు. మీ ఫోన్ నుంచి నార్మల్ గా వచ్చే రేడిషన్ వల్లే శరీరానికి ప్రమాదం. అలాంటిది ఫోన్ ఛార్జ్ లో ఉన్నప్పుడు ఆ రేడియేషన్ మరింత ఎక్కువగా ఉంటుంది. సాధారణంతో పోలిస్తే.. పదింతలు ఎక్కువగా రేడియేషన్ వెలువడుతుంది. అది మీ శరీరాన్ని మరింతగా దెబ్బతీస్తుంది. అందుకే మొబైల్ కి ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడకూడదు అని చెబుతారు. కానీ, చాలా మంది ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి ఇష్టానుసారంగా ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. దాని వల్ల మీకు చాలా ప్రమాదం.
సాధారణంగానే ఫోన్లు వాడేకొద్దీ వేడెక్కుతూ ఉంటాయి. ఎందుకంటే ఫోన్ లో ఉండే ప్రాసెసర్ పనిచేసే కొద్దీ హీటవుతూ ఉంటుంది. ఆ వేడికి ఫోన్ బ్యాటరీ కూడా వేడెక్కుతుంది. మీరు ఛార్జింగ్ పెట్టడం వల్ల ఫోన్ హీటెక్కడం మాత్రమే కాదు.. మీరు ఫోన్ యూజ్ చేయడం వల్ల మరింత వేడెక్కుతుంది. ఒక్కోసారి అలా హీటెక్కి ఫోన్ బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అలా పేలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. పెద్దవాళ్లే కాకుండా.. పిల్లలు కూడా అలా ఫోన్ పేలి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే మీరు ఫోన్ ని ఛార్జింగ్ పెట్టి అస్సలు వాడకండి. మీ ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు.
ఫోన్ ని ఛార్జింగ్ పెట్టి వాడటం వల్ల బ్యాటరీ హీటవ్వడం, పేలిపోవడం మాత్రమే కాకుండా మొబైల్ హెల్త్ పాడవుతుంది. మీ స్మార్ట్ ఫోన్ చాలా త్వరగా పాడవుతుంది. 5 సంవత్సరాలు వస్తుందనుకున్న ఫోన్ కేవలం రెండేళ్లకు మూలనపడుతుంది. అందుకే టెక్ నిపుణులు కూడా ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి అస్సలు వాడకండని హెచ్చరిస్తున్నారు. అలా చేయడం వల్ల లేనిపోని సమస్యను కొని తెచ్చుకున్నట్లేనంటూ సూచిస్తున్నారు. మీ స్మార్ట్ ఫోన్– మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడటం మానేయండి.