Mexico: చనిపోయిన తర్వాత ఓ మనిషి బతికి రావటం అన్నది అసాధ్యం. కానీ, డాక్టర్లు చనిపోయాడని ధ్రువీకరించిన తర్వాత మనుషులు బతికి రావటం తరచుగా జరుగుతోంది. ‘క్లినికల్లీ డెడ్’ అని ధ్రువీకరణ అయిన తర్వాత కూడా కొంతమందిలో ప్రాణం ఉంటుంది. వారు బతికే అవకాశం కూడా ఉంటుంది. అలా చాలా మంది బతికారు కూడా. తాజాగా, చనిపోయింది అనుకున్న ఓ మూడేళ్ల బాలిక బతికింది. శ్మశానంలో పైకి లేచి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. మెక్సికోకు చెందిన మేరీ జేన్ మండోజాకు కమిల్లా రోక్సానా మార్టినెజ్ మండోజా అనే మూడేళ్ల కూతురు ఉంది. కొద్దిరోజుల క్రితం కామిల్లా తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో బాలికను విల్లారోమ్ డామోస్‌లోని ఓ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు.
అయితే, బాలిక పరిస్థితి గమనించిన డాక్టర్ ఆమెను వేరే ఆసుపత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చాడు. తల్లిదండ్రులు ఆమెను సెంట్రల్ మెక్సికన్ స్టేట్ ఆఫ్ సాన్ లూయిస్‌కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ ఏదో వైద్యం చేసి, పారాసిటమల్ టాబ్లెట్ ఇచ్చి ఇంటికి పంపేశాడు. అయితే, పాప పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఆమెను మరో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అతడు కూడా మందులు రాసిచ్చి, పాపకు పండ్లు తినిపించమని చెప్పి పంపించాడు. అయినా పాప పరిస్థితిలో మార్పు రాలేదు. మళ్లీ లూయిస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పాపను పరీక్షించిన వైద్యులు ఓ నిర్ణయానికి వచ్చారు. పాప బతకదని భావించారు. అదే విషయాన్ని తల్లికి చెప్పి, పాపను ఓ సపరేట్ గదిలో ఉంచారు.
కొద్ది సేపటి తర్వాత కామిల్లా చనిపోయినట్లు ధ్రువీకరించారు. మరుసటి రోజు పాప అంత్యక్రియలు ఏర్పాటు చేయబడ్డాయి. ఓ గాజు శవ పేటికలో పాపను ఉంచారు. బంధువులు కామిల్లా చావును జీర్ణించుకోలేకపోయారు. కామిల్లా అమ్మమ్మ శవ పేటిక దగ్గరగా పోయి పాపను చూసింది. కామిల్లా కళ్లు కదులుతూ ఉన్నాయి. దీంతో ఆమె ఆశ్చర్యపోయింది. తర్వాత కామిల్లాను పరీక్షించి చూడగా.. పల్స్ ఉన్నట్లు తేలింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ సారి కూడా డాక్టర్లు పాపను కాపాడలేకపోయారు. కొద్దిసేపటి తర్వాత కామిల్లా చనిపోయింది. ఈ సారి సెరెబ్రల్ ఎడెమాతో చనిపోయిందని డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : PWC: అతిగా తాగి కోమాలోకి.. లేచే సరికి సగం పుర్రె లేదు..!