ఫిల్మ్ డెస్క్- తమిళ స్టార్ కమేడియన్ వివేక్ అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. సినీమా రంగంలో అంచెలంచెలుగా ఎదిగి హీరోకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్ కు ఎదిగారు వివేక్. కరోనా సోకి తగ్గిన తరువాత, కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారం రోజులకు గుండెపోటుతో చనిపోయారు వివేక్. ఐతే వివేక్ నటిస్తూ మధ్యలో ఉన్న సినిమాల నిర్మాణానికి సంబందించి నిర్మాతల్లో కొంత ఆందోళన నెలకొంది.
చెన్నైలోని ప్రముఖ వస్త్రదుకాణం శరవణా స్టోర్స్ అధినేత శరవణన్ అరుళ్, ఊర్వశి రౌతేలా జంటగా జేడీ, జెర్రీ కలిసి ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 60 శాతానికి పైగా పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో హీరో స్నేహితుడిగా ప్రముఖ హాస్య నటుడు వివేక్ నటించారు. ఆయన అకాల మరణంతో ఆయన పాత్రను అదే పోలికలతో ఉన్న నటుడు లేదా గ్రాఫిక్స్‌తో ప్రతిసృష్టి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో వివేక్ పాత్ర నిడివిని కూడా కొంత మేర తగ్గించారు. డూప్ తో మిగిలిన పాత్ర చేయించాల్సిన పరిస్థితి రావడంతో దర్శకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వివేక్ పోలికల్లో ఏ మాత్రం తేడా కనిపించకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖర్చు కాస్త ఎక్కువైనా గ్రాఫిక్స్ తో వివేక్ రూపాన్ని యధావిధిగా కనిపించేలా ప్రతిసృష్టి చేస్తున్నారట సాంకేతిక నిపుణులు.
ఈ సినిమాకు ఇంకా పేరును ఖరారు చేయలేదు. ఈ మూవీకి హ్యారీస్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా, సీనియర్ నటులు హీరో ప్రభు, విజయ్ కుమార్, నాజర్, మయిల్‌స్వామి, కాళి వెంకట్, తంబి రామయ్య, నాజర్, కోవై సరళ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరిలో ఈ సినిమా విడుదలకానుందని తెలుస్తోంది.