దాయాది దేశం పాకిస్తాన్ హిందువులపై విషం చిమ్ముతూనే ఉంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వారి ఆచారాలు, సంప్రదాయాలు, ఆలయాలపై దాడులు చేస్తోంది. మరోసారి తన దుర్భుద్దిని బయటపెట్టింది.
పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి హిందువులపై ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులకు పాల్పడుతూ భయబ్రాంతులకు గురిచేస్తోంది. మరోవైపు భారత్ పై ఉగ్రవాదులను ఉసిగొల్పి దాడులు చేసి అల్లకల్లోలం సృష్టించేందుకు పాక్ కుట్రలు పన్నుతుంది. కాగా ప్రజలు భక్తి భావంతో కొలుచుకునే హిందూ దేవాలయాలు ఇండియాలోనే కాక పాకిస్తాన్ లో కూడా ఉన్నాయి. స్వాతంత్ర్యం రాక పూర్వం పాకిస్తాన్ భారత్ లోనే కలిసి ఉండేది. ఆ సమయంలో హిందూ ప్రజలు పూజలు, వేడుకలు నిర్వహిస్తుండే వారు. స్వాతంత్య్రం అనంతరం వేర్వేరు దేశాలుగా ఏర్పడిన తర్వాత పాక్ లో హిందువులు, హిదూ దేవాలయాలు కలిసిపోయాయి. అయితే తాజాగా కరాచీలో ఓ హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు కొందరు దుండగులు. ఈ ఘటనపై హిందూ సమాజం పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
పాక్ లోని కరాచీలో పురాతనమైన మారి మాతా హిందూ దేవాలయం ఉంది. ఈ ఆలయం సుమారు 150 ఏళ్ల క్రితం నిర్మించినట్లుగా చెబుతున్నారు. ఈ ఆలయంలో మద్రాసీ హిందూ సమాజం పూజలు నిర్వహిస్తుండేదని సమాచారం. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆలయాన్ని కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే కూల్చివేశారు. శుక్రవారం అర్థరాత్రి బుల్డోజర్ తో వచ్చిన కొందరు ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని అక్కడి వార్తా పత్రిక డాన్ తన రిపోర్ట్ లో వెల్లడించింది. అయితే ఆలయ ప్రహరీని కూలగొట్టకుండా గర్బగుడిని మాత్రమే ధ్వంసం చేయడంతో గుప్త నిధుల కోసమే కూల్చివేతకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయంపై దాడికి పాల్పడిన వ్యక్తులు కొన్ని రోజులుగా రెక్కీ నిర్వహించారని స్థానికులు తెలుపుతున్నారు. ఆలయం పురాతనమైనది కాబట్టి ఏ సమయంలో ప్రమాదం ముంచుకుస్తుందో అని గుడిలోని విగ్రహాలను వేరే చోటుకి మార్చామని, ఇంతలోనే ఆలయాన్ని కూల్చివేశారని ఆలయ సంప్రోక్షకుడు శ్రీ రామ్ నాథ్ మిశ్రా మహారాజ్ వెల్లడించారు. కాగా మరోవైపు అధికారులు మాట్లాడుతూ.. ఆలయం శిథిలావస్థలో ఉడడంతోనే కూల్చివేత చేపట్టినట్లు తెలిపారు.