బ్రిటన్ (ఇంటర్నేషనల్ డెస్క్)- ఓ బిడ్డకు జన్మనివ్వడమంటే తల్లి మరో జన్మ ఎత్తడమే. బిడ్డను కనే సమయంలో తల్లి పడే ప్రసవ వేదన వర్ణణాతీరం. ఒక్కోసారి పురిటి నొప్పులు గంటల తరబడి ఉన్నా.. పంటి బిగువన భరిస్తుంది తల్లి. ఇక ఓ తల్లి పురిటి నొప్పులు వచ్చాక ఎంత సమయంలో బిడ్డను కంటుందన్నదానికి ఇప్పటి వరకు నిర్దిష్ణమైన సమయం అంటూ లేదు. వారి వారి ఆరోగ్యం, గర్బ సమయాన్ని బట్టి బిడ్డను ప్రసవిస్తారు తల్లులు. అయితే బ్రిటన్ లో ఓ తల్లి మాత్రం అర నిమిషం లోపలే బిడ్డను కంది. అవును 29 ఏళ్ల సోఫీ బగ్ ఎలాంటి పురుటి నొప్పులూ లేకుండా కేవలం 27 సెకెండ్లలోనే ఓ బిడ్డకు జన్మనిచ్చి రికార్డు సృష్టించింది. బ్రిటన్ లోని హాంప్ షైర్ లో నివసిస్తున్న సోఫీ బగ్ 38 వారాల నిండు గర్భిణి. మొన్న అనుకోకుండా అర్ధరాత్రి ఆమె బాత్‌రూంకు వెళ్లగా.. అనుకోకుండా పురిటి నొప్పులు మొదలయ్యాయట.
వెంటనే సాయం కోసం భర్తను పిలిచింది. భర్త క్రిస్ వచ్చే సరికి బాత్‌రూం బయట మెట్లపై కూర్చుని ఉంది. పక్కన చూస్తే పండండి బిడ్డ. అవును అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. కేవలం 27 సెకన్లలోనే పురిటి నొప్పులు రావడం, బిడ్డ పుట్టడం జరిగిపోయింది. ఇది నిజంగా అద్భుతం అని వైద్యులు చెబుతున్నారు. వేగంగా బిడ్డను ప్రసవించిన మహిళగా సోఫీ రికార్డు నెలకొల్పంది. ఐతే సోఫీ తన మొదటి బిడ్డను 12 నిమిషాల్లో, రెండో బిడ్డను 26 నిమిషాల్లో ప్రవించిందట. ఇదిగో ఇప్పుడు మూడో బిడ్డను కేవలం 27 సెకెండ్లలోనే ప్రసవించి ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో బిడ్డను కన్న రికార్డు సృష్టించింది. సిజేరియన్ చేస్తే కాని ప్రసవాలు జరగని ఈ కాలంలో ఇలా 27 సెకన్లలో బిడ్డను ప్రసవించడం నిజంగా అద్భుతమనే చెప్పాలి.