రిసెర్చ్ డెస్క్- తొలి చూపులోనే ఆమెను ఇష్టపడ్డాడు.. చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతే ఇక ఏ మాత్రం అలస్యం చేసుకుండా తన మనసులో మాట తాను ఇష్టపడ్డ 17 ఏళ్ల అమ్మాయికి చెప్పేశాడు. ఆ అమ్మాయికి కూడా ఇష్టమవ్వడంతో సిగ్గుతోనే 22 ఏళ్ల ఆ అబ్బాయికి ఓకే చెప్పింది. కానీ మనసులో చిన్న అనుమానం ఆమెకు. ఇంట్లో అబ్బాయి ఏంచేస్తున్నాడంటే ఏంచెప్పాలని మొహం మీదే అడిగేసింది. ఐతే ఆ అబ్బాయి మాత్రం ఏ మాత్రం తడుముకోకుండా.. ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని మీ ఇంట్లో చెప్పు.. అన్నాడు. వయసులో ఉంది కదా ఆ అబ్బాయి చెప్పిన మాటను కొంత నమ్మి, మరికొంత నమ్మనట్టు ఉండిపోయింది. ఆ తరువాత పదేళ్లకు వారిద్దరికి పెళ్లైంది.
ఏంటీ ఇది ఏ సినిమా కధబ్బా.. అని ఆలోచనలో పడ్డారా.. లేక కొత్త సినిమా స్టోరీ ఏమైనా చెబుతున్నామనుకుంటున్నారా.. ఇప్పుడు చెప్పింది అక్షరాల నిజజీవితంలో జరిగిన యధార్ద ఘటన. అసలు విషయానికి వస్తే మొన్న జరిగిన అస్సాం ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధించింది. దీంతో అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం చేశారు. ఇందాక మనం చెప్పుకున్న కధలో హీరో ఈయనే మరి. అవును సరిగ్గా 30 ఏళ్ల క్రితం హిమంత బిశ్వ శర్మ, రినికి భుయాన్ ను చూసి ఇష్టపడ్డాడట. వెంటనే ఆమెను పెళ్లిచేసుకుంటానని చెప్పే సరికి, కాస్త అవాక్కైన రినికి.. ఇంతకీ నువ్వేం చేస్తావని ఇంట్లో చెప్పాలని కాస్త గడుసుగానే ప్రశ్నించింది. దీనికి తాను ఎప్పటికైనా అస్సాం ముఖ్యమంత్రిని అవుతానని మీ ఇంట్లో చెప్పమని ధీటుగా సమాధానం చెప్పారట హిమంత.
అప్పుడు ఆయన మాటను ఎవ్వరు నమ్మలేదనుకొండి. కానీ ఇప్పుడు నిజంగానే హిమంత బిశ్వ శర్మ చెప్పిన విధంగానే అస్సాం ముఖ్యమంత్రి అయ్యారు. ఈ విషయాన్ని ఆయన అప్పుడు ఇష్టపడ్డ అమ్మాయి, ఇప్పుడు సీఎం భార్య రినికి భుయాన్ స్వయంగా చెప్పారు. ఐతే ఆ అమ్మాయి అంత గుడ్డిగా ఆ అబ్బాయిని నమ్మలేదట. హిమంత ఎమ్మెల్యే అయ్యాకే ఆయన్ను పెళ్లి చేసుకుందట. ఆ తరువాత మంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు హిమంత. మరి ఆమె ప్రేమ కోసం ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడంటే మాటలు కాదు కదా. ఇలా చెప్పి మరీ తన లక్ష్యాలను సాధించే వాళ్లు ఎంత మంది ఉంటారు చెప్పండి.