భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన చివరి టెస్టు అనూహ్యంగా రద్దయిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి భారత క్రికెటర్లందరికీ కోవిడ్ పరీక్షలు చేయగా రిపోర్టులు నెగెటివ్‌గా వచ్చినా మ్యాచ్ మధ్యలో ఏదైనా జరగవచ్చనే భయమే టీమిండియా ఆటగాళ్లను బరిలోకి దిగకుండా చేసింది. సహజంగానే కరోనా ప్రభావం కొంత ఆలస్యంగా కనిపించే అవకాశం ఉంది కాబట్టి ఆడకపోవడమే మంచిదని కోహ్లీసేన భావించింది. మ్యాచ్ జరగాల్సిన రోజు ఉదయం సుదీర్ఘ సమయం పాటు చర్చించాక బీసీసీఐ, ఈసీబీ టెస్టును రద్దు చేయాలని నిర్ణయించాయి. అయితే టెస్ట్ సిరీస్ ఇలా ముగియడంపై ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ అసహనం వ్యక్తం చేశాడు. సిరీస్ ఇలా ముగియడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
మ్యాచ్ రద్దు అవ్వడంపై భావోద్వేగంగా స్పందిస్తూ.. ఈ వేసవి అంతర్జాతీయ క్రికెట్ ఇలా ముగియడం నిజంగా సిగ్గుచేటని, సీజన్ ఆఖరి మ్యాచ్‌ను ఆస్వాదించాలని భావించిన అభిమానులు తమను క్షమించాలని తన ఇన్ స్టాగ్రాం పోస్టులో జిమ్మీ రాసుకొచ్చాడు. సిరీస్ డిసైడర్ అయిన మాంచెస్టర్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్లు, హోటల్ గదులు బుక్ చేసుకున్న అభిమానులు తమను మన్నించాలని.. మ్యాచ్ రీషెడ్యూల్ అవ్వాలని ఆశిద్దామని పేర్కొన్నాడు. తన హోంగ్రౌండ్ (ఓల్డ్ ట్రాఫర్డ్)లో మరో మ్యాచ్ ఆడే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాని అండర్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
కాగా 4 టెస్ట్ మ్యాచ్‌ల్లో 24.67 సగటుతో 15 వికెట్లు పడగొట్టిన జేమ్స్ ఆండర్సన్.. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. 15 వికెట్లలలో జిమ్మీ ఓసారి 5 వికెట్ల ప్రదర్శన, మరోసారి 4 వికెట్ల ప్రదర్శన చేశాడు. అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్ ( 21) అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా (18) రెండో స్థానంలో నిలిచాడు. అండర్సన్‌కు భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీసే చివరిదని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఐదవ టెస్ట్ మ్యాచ్.. అండర్సన్ ఆడే చివరి మ్యాచ్ అని ఓ ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ కూడా పేర్కొనడం గమనార్హం. అయితే హెంగ్రౌండ్‌లో మరో మ్యాచ్ ఆడే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాని జిమ్మీ అనడంతో ఆటలో కొనసాగుతాడని తెలుస్తోంది.