మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై దక్షిణాదినే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా భారీ అంచనాలు నమోదవుతున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీని డీవీవీ దానయ్య ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటులు అలియాభట్, అజయ్ దేవగన్ తో పాటు మరికొంత మంది నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పాటలు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణంలోనే తాజాగా ఈ చిత్ర బృందం నుంచి ఓ కీలక అప్ డేట్ రానే వచ్చింది.
ఆగస్టు1న ఆర్ఆర్ఆర్ మూవీ మొదటి సాంగ్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. కొద్దిసేపటి క్రితం ప్రకటించిన వార్తతో సినీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ నెట్టింట్లో రికార్డు క్రేయేట్ చేస్తోంది. నరాలు తెగే ఉత్కంఠను తలపిస్తున్న ఈ టీజర్ లో చరణ్, ఎన్టీఆర్ ల మధ్య పోరాట సన్నివేశాలు రక్తికట్టిస్తున్నాయి. దీంతో ఈ సినిమా విడుదల కోసం ప్రతీ ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో అంచనాలు కూడా అంతకు మించి ఉన్నాయి.
ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా మ్యూజికల్ రైట్స్ ను సౌత్ మొత్తానికి గానూ లహరి సంస్థ, ఉత్తరాదిన టీ సిరీస్ సంస్థలు ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ రైట్స్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమా ఆడియో రైట్స్ సుమారు 25 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ మధ్య కాలంలో ఇంత భారీ మొత్తంలో ఆడియో రైట్స్ అమ్ముడు పోవడం ఇదేనని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. చిత్ర షూటింగ్ కూడా చివరి ఘట్టానికి చేరుకోవటంతో సినిమా విడుదలకు అని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఇక ఆగస్టు 1న విడుదల కానున్న మొదటి సాంగ్ కోసం అందరు ఎంతో ఆత్రుతగా ఎదురుచుస్తున్నారు.