2022 సంవత్సరం ముగియటానికి కేవలం ఒక రోజు మాత్రమే ఉంది. ఒకరకంగా చెప్పాలంటే కొన్ని గంటలు మాత్రమే ఉంది. ఇంకొన్ని గంటల్లో పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం వస్తుంది. ఇక, తెలుగు చిత్ర సీమలో 2022 సంవత్సరం విషాదాలను నింపిందని చెప్పాలి. సంవత్సరం చివర్లో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. ఒకే నెలలో ముగ్గురు సినీ ప్రముఖులు కన్నుమూశారు. అంతేకాదు! ఈ సంవత్సరం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రముఖులు చనిపోయారు. 2022లో మరణించిన సినీ ప్రముఖులు ఎవరంటే..
రమేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి వచ్చారు ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు. 80లలో పలు సినిమాల్లో హీరోగా నటించారు. 90లనుంచే సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అనారోగ్య కారణాల వల్ల 2022 జనవరి 8న తుది శ్వాస విడిచారు.
లతా మంగేష్కర్
తన గాత్రంతో భారత సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు గాయని లతా మంగేష్కర్. ఈమె తెలుగుతో పాటు దాదాపు 20 భాషల్లో పాటలు పాడారు. దాదాపు 50 వేలకు పైగా పాటలను పాడారు. 1942లో పుట్టిన లతా మంగేష్కర్ 2022, ఫిబ్రవరి 6న కన్నుమూశారు.
గాయత్రి అలియాస్ డాలీ డీ క్రూజ్
యూట్యూబ్‌లో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గాయత్రి అలియాస్ డాలీ డీ క్రూజ్. తర్వాతి కాలంలో ఆమె సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. చిన్న చిన్న సినిమాలు చేస్తూ అప్పుడప్పుడే మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంటున్నారు. ఇంతలోనే అనుకోని విషాదం చోటుచేసుకుంది. 2022 మార్చి 18న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించారు.
మన్నవ బాలయ్య
తెలుగు చిత్ర సీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా భేష్ అనిపించుకున్న అతి కొద్ది మందిలో మన్నవ బాలయ్య ఒకరు. 1950లో వచ్చిన ఎత్తుకు పై ఎత్తు సినిమాతో పరిశ్రమలోకి వచ్చారు. దాదాపు 63 ఏళ్ల పాటు సినిమా పరిశ్రమలో కొనసాగారు. కొన్ని వందల సినిమాల్లో నటించారు. నటుడిగానే కాక, రచయితగా, దర్శకుడిగా.. నిర్మాతగా కూడా బహుముఖ ప్రజ్ఞను కనబరిచారు. అనారోగ్యం కారణంగా 2022 ఏప్రిల్ 9న తుది శ్వాస విడిచారు.
కేకే
తెలుగు ప్రేక్షకులకు ఈయన పేరు అంతగా తెలియకపోయినా.. ఆయన గొంతు వింటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. కేకే 90 దశకంలో తెలుగులో పలు బ్లాక్ బాస్టర్ హిట్ పాటల్ని పాడారు. తెలుగుతో పాటు భారత్‌లోని అన్ని భాషల్లో పాటలను పాడారు. 2022, మే 31న ఓ పాటల పోగ్రామ్‌లో పాటలు పాడుతూ గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
కృష్ణం రాజు
తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్నారు సీనియర్ నటుడు కృష్ణంరాజు. తనదైన నటనతో టాలీవుడ్ రెబల్ స్టార్‌గా గుర్తింపుతెచ్చుకున్నారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందల సినిమాలు చేశారు. 2022 సెప్టెంబర్ 11న అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
కృష్ణ
తెలుగు తెరపై తిరుగులేని నటుల్లో కృష్ణ ఒకరు. సాహసాలకు, కొత్తదనానికి ఆయన పెట్టింది పేరు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న నటుల్లో కృష్ణ ఒకరు. ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేని రికార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. ఒకే సంవత్సరంలో 17 సినిమాలు చేసి చెరపలేని రికార్డును నెలకొల్పారు. వందల సినిమాల్లో హీరోగా చేశారు. అనారోగ్యం కారణంగా 2022 నవంబర్ 15న తుది శ్వాస విడిచారు.
కైకాల సత్యనారాయణ
నవరస నటనా సార్వభౌవుడిగా పేరుతెచ్చుకున్న అతి కొద్ది మంది నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు. తన నటనతో దాదాపు 50 ఏళ్లకుపైగా ప్రేక్షకులను అలరించారు. వందల సంఖ్యలో సినిమాల్లో నటించారు. ఆయన తన జీవిత కాలంలో దాదాపు 777 సినిమాలు చేశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల 2022 డిసెంబర్ 23న తుది శ్వాస విడిచారు.
చలపతి రావు
చలపతి రావు 1944లో కృష్ణా జిల్లాలో పుట్టారు. ఎన్టీ రామారావు కారణంగా చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. తన కెరీర్‌లో అన్ని రకాల పాత్రల్ని పోషించారు. ఇప్పటివరకు దాదాపు 1500లకు పైగా సినిమాల్లో నటించారు. ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డ ఆయన కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరం అయ్యారు. 2022 డిసెంబర్ 22న గుండెపోటు కారణంగా హఠాన్మరణం పొందారు.
వల్లభనేని జనార్థన్
తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వల్లభనేని జనార్థన్. గ్యాంగ్ లీడర్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ పాత్రలో నటించి శభాష్ అనిపించుకున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించడంతో 2022 డిసెంబర్ 29 ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచారు.