‘లప్పాం గిరి గిరి.. టేచల్ టేచల్.. పిచ్చ కొట్టుడు కొట్టారు..’ ఇలాంటి డైలాగ్‌లతో తెలుగు ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తిన సీనియర్ నటుడు సుధాకర్. ఈయన ఇప్పుడు 64 సంవత్సరాల వయస్సులో ఎవరూ గుర్తుపట్టలేనంతగా అయిపోయారు. అబ్బబ్బబ్బా.. అంటూ డైలాగ్ గుర్తుచేస్తూ నవ్వించేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో అందరిచే నవ్వుల పువ్వులు పూయించిన కమెడియన్, సీనియర్ నటుడు సుధాకర్. ఆయన ఎన్నో సినిమాలు తీసి అందరిని కడుపుబ్బ నవ్వించారు. తెరపై నవ్వుల్ని పంచి ప్రేక్షకుల ఆయుష్షు పెంచిన సుధాకర్ ఇప్పుడు వయసు పైబడడంతో ఇంట్లోనే ఉంటున్నారు. ‘లప్పాం గిరి గిరి.. టేచల్ టేచల్.. పిచ్చ కొట్టుడు కొట్టారు..’ ఇలాంటి డైలాగ్‌లు చెప్పి ప్రేక్షకులను అలరించేవారు. నవ్వుతూ.. అందరిని నవ్విస్తూ సినీ పరిశ్రమలో 45 సంవత్సరాలపాటు ఆడియన్స్ మనసుల్ని దోచుకున్న సుధాకర్ గురించి తెలుసుకుందాం..
పవిత్ర ప్రేమ, మజ్ను, చక్రవర్తి, యముడికి మొగుడు, ఒంటరిపోరాటం, స్టేట్ రౌడీ, కొదమ సింహం, రాజా విక్రమార్క, పవిత్ర బంధం, బొంబాయి ప్రియుడు, పెళ్లి పందిరి, పెళ్లి చేసుకుందాం, సుస్వాగతం.. ఇలా చెప్పుకుంటూ పోతే వందల సినిమాలలో సీనియర్ నటుడు సుధాకర్ నటించారు. తన అద్భుత నటనతో ఆడియన్స్‌ని నవ్వులతో ఆకట్టుకున్నారు. ప్రముఖ హీరోలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున మొదలైన వారితో కలిసి నటించారు. తన పవర్ ఫుల్ డైలాగ్‌లతో నవ్వుల్ని పంచిన నటుడు సుధాకర్. ఈ మధ్యకాలంలో అతనిపై కొన్ని ఫేక్ న్యూస్ వచ్చాయి. కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేశాయి. అది చూసి.. తనపై వచ్చిన దుష్రచారాన్ని తట్టుకోలేకపోయాడు. ‘నేను బతికే ఉన్నాను మొర్రో.. నా నవ్వు ఇంకా ఆగలేదు’ అంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. అందులో సుధాకర్ తన క్షేమ సమాచారాన్ని అభిమానులకు తెలియజేశారు.
జూన్ 18న ఫాదర్స్ డే సందర్భంగా జీ తెలుగులో ‘నేను నాన్న’ అన్న ప్రత్యేక కార్యక్రమంలో సుధాకర్ కనిపించారు. వయసు పైబడి ఓపిక లేకపోయినా డైలాగ్ చెప్పడానికి ప్రయత్నం చేశారు. చెమ్మగిళ్లిన కళ్లతో ఉన్న సుధాకర్‌కు హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని తన కొడుకు కేక్ తినిపించాడు. ‘అబ్బబ్బబ్బా’ అంటూ తన డైలాగ్ తో నవ్వించేశారు. కమెడియన్‌గా కాకుండా.. హీరోగా, నిర్మాతగా కూడా సుధాకర్ పనిచేశాడు. యముడికి మొగుడు, తాతయ్య పెళ్లి మనవడి శోభనం వంటి సినిమాలకు నిర్మాతగా పనిచేశారు. తమిళం, హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లో కూడా నటించారు. ప్రస్తుతం ఆయనకు 64 ఏళ్లు.. కాగా.. ఇలాగే నవ్వుతూ..నవ్విస్తూ ఉండాలని కోరుకుందాం.