సినిమాల్లో, తెలుగు రాజకీయాల్లో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కానీ ఈ కుటుంబంలో జరుగుతున్న సంఘటనలు, వరస మరణాలు అందరినీ బాధపెడుతున్నాయి.
నందమూరి కుటంబాన్ని అనుకోని ప్రమాదాలు, హఠాన్మరణాలు వెంటాడుతూనే ఉన్నాయి. కొందరు ప్రమాదాల్లో మరణిస్తే.. మరికొందరు అనారోగ్య సమస్యలతో అంటే గుండెపోటుతో చనిపోతున్నారు. ఇదంతా చూసి మిగతా కుటుంబసభ్యులే కాదు, అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఒకరో ఇద్దరో అది కూడా అనుకోకుండా జరిగితే తట్టుకోగలరు గానీ ఏళ్ల వ్యవధిలో మరణిస్తుండటం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. అంతులేని శోకాన్ని మిగుల్చుతోంది. ఇక నందమూరి ఫ్యామిలీలో ఇలా అకస్మాత్తుగా జరిగిన విషాదాలు ఏంటి? అవి ఎప్పుడెప్పుడు జరిగాయనేది ఇప్పుడు చూద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తొలుత ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇండస్ట్రీలో నిర్మాతగా పేరు తెచ్చుకుంటున్న టైంలో ఆయన చనిపోవడం నందమూరి కుటుంబసభ్యుల్ని చాలా బాధపెట్టింది. త్రివిక్రమరావు చిన్న కొడుకు హరిన్ చక్రవర్తి కూడా రోడ్ యాక్సిడెంట్ లోనే మృతి చెందాడు. ‘మనుషుల్లో దేవుడు’ మూవీతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన హరిన్.. 1986లో ‘మామ కోడళ్ల సవాల్’తో హీరోగా మారాడు. అయితే నటుడిగా ఎదిగే టైంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇక హరిన్ సోదరుడు కల్యాణ్ చక్రవర్తి కొడుకు పృథ్వీ కూడా రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఇలా తనవాళ్లు చనిపోవడంతో.. కల్యాణ్ చక్రవర్తి.. చెన్నైలో స్థిరపడ్డారు.
ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ.. ఈయన పెద్ద కొడుకు జానకిరామ్ రోడ్డు యాక్సిడెంట్స్ లోనే చనిపోయారు. 2014 డిసెంబరు 6న జానకిరామ్.. నల్గొండ జిల్లా ఆకుపాముల దగ్గర ప్రమాదానికి గురై చనిపోగా.. ఇది జరిగిన దాదాపు నాలుగేళ్లకు 2018 ఆగస్టు 29న హరికృష్ణ.. నల్గొండ జిల్లా అన్నెపర్తి దగ్గర కారు యాక్సిడెంట్ లో మృతి చెందారు. 2022 ఆగస్టు 1న ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి.. ఉరివేసుకుని తనువు చాలించారు. ఇది కాదన్నట్లు 2009లో ఎలక్షన్ హడావుడిలో ఉన్న ఎన్టీఆర్ కారు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డారు. అయితే కొన్నిరోజుల చికిత్స తర్వాత మాములు మనిషయ్యారు.
రీసెంట్ గా హైదరాబాద్.. ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కారుకు ప్రమాదం జరిగింది. ఇలా మొత్తంగా చూసుకుంటే.. నందమూరి ఫ్యామిలీ అనగానే అనుకోని ప్రమాదాలు, హఠాన్మరణాలు కళ్ల ముందు మెదులుతాయి. ఇదంతా చూస్తుంటే.. నందమూరి కుటుంబానికి ఏమైనా శాపం ఉందా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. శాంతి పూజలు, పాప పరిహారం లాంటివి చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి నందమూరి ఫ్యామిలీలో ఇలా చాలామంది అనుకోని ప్రమాదాలు, గుండెపోటుతో మృతి చెందడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.