కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం దక్షిణాది సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. యావత్ దేశాన్ని షాక్‌కు గురిచేసిన వార్త అది. పునీత్ వ్యక్తిత్వం, ఆయన చేసిన సమాజ సేవను కొనియాడని వారుండరు. ఇప్పుడు పునీత్ రాజ్‌కుమార్ నటించిన ‘జేమ్స్’ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఆ సినిమా నిర్మాణం పూర్తయ్యిందా? కాలేదా? పునీత్ పాత్రను ఎలా మేనేజ్ చేస్తారు? అందరికీ ఇదే ఆలోచన. పునీత్ నటించిన చివరి సినిమా కావడంతో అందరికీ ఈ సినిమాతో సెంటిమెంటల్ అటాచ్‌మెంట్ కచ్చితంగా ఉంటుంది. ఆయనను తెర మీద చూసే అవకాశం ఇంక ఉండదు అన్న వార్త తెలుసుకాబట్టి.. అందరూ ఈ సినిమాను కచ్చితంగా చూస్తారు. మరి ఆ సినిమా గురించి మీకు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పబోతున్నాం.
పునీత్ రాజ్‌కుమార్ అభిమానులకు ఇది ఒకింత రిలీఫ్ ఇచ్చే వార్త. ‘జేమ్స్’ సినిమాకు సంబందించి పునీత్ రాజ్ కుమార్ పాత్ర చిత్రీకరణ మొత్తం పూర్తయ్యిందని చిత్ర బృందం తెలిపింది. సినిమాలో పునీత్‌తో ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలిపారు. ఆ పాటను చిత్రీకరించే ఉద్దేశం కూడా వారికి లేనట్లు తెలుస్తోంది. సినిమాలో పునీత్ క్యారెక్టర్ మొత్తం పూర్తయ్యింది కాబట్టి.. సినిమా రిలీజ్‌కు ఎలాంటి ఆటంకం లేదు. కానీ, పునీత్ రాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పలేదు. వారు ముందు ఉన్న అతిపెద్ద సవాలు ఇది. పునీత్‌కు వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పే ఉద్దేశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
పునీత్ పాత్రకు డబ్బింగ్ విషయంలో ఒక అధునాతన సాంకేతికతను వినియోగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్ టైమ్‌లో లైవ్‌లో రికార్డు చేసిన రఫ్ డైలాగ్స్‌నే సాఫ్ట్‌వేర్ సాయంతో క్వాలిటీ పెంచి సింక్ చేస్తారనే వాదన వినిపిస్తోంది. అది ఆచరణలో ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది తెలీదు. నార్మల్ షూటింగ్ సమయంలో అన్ని సందర్భాల్లో హీరో గట్టిగా డైలాగ్ చెప్పాలని లేదు.. చెప్పె అవకాశాలు కూడా తక్కువే. ఫుల్ లెంగ్త్‌లో డైలాగ్స్ చెప్పి ఉంటే ఆ అవకాశం ఉంటుంది. మరోవైపు పునీత్ మరణం తర్వాత జేమ్స్ సినిమాలో శివ రాజ్‌కుమార్‌తో డబ్బింగ్ చెప్పిస్తారు అని కూడా చెప్పుకున్నారు. ఆ విషయాన్ని కూడా కొట్టిపారేయలేం. మరి ఆ టెక్నాలిజీ వర్కౌట్ కాకపోతే కచ్చితంగా శివ రాజ్‌కుమార్ తోనే డబ్బింగ్ చెప్పించాల్సి ఉంటుందని భావిస్తున్నారు.