సామాన్యులు ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా పట్టించుకోరు కానీ.. సెలబ్రిటీలు మీడియా ముందు మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మెగాస్టార్ చిరంజీవి ‘చెడు చెవిలో చెప్పాలి.. మంచి మైక్‌లో చెప్పాలి’ అన్నారు.
సామాన్యులు ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా పట్టించుకోరు కానీ.. సెలబ్రిటీలు మీడియా ముందు మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మెగాస్టార్ చిరంజీవి ‘చెడు చెవిలో చెప్పాలి.. మంచి మైక్‌లో చెప్పాలి’ అన్నారు. ఎదుటి వారి మీద మనకి దురభిప్రాయం ఉన్నా కానీ బయట పడకూడదు. దాని వల్ల తర్వాత నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్న హీరో హీరోయిన్లు, ఇతర సినీ ప్రముఖులు చాలా మందే ఉన్నారు. ఫ్లోలో చెప్పాల్సింది చెప్పేసి.. తీరా వివాదం రేగాక దాన్ని సద్దుమణిగేలా చేయడానికి భలే తంటాలు పడ్డారు కూడా. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి కూడా ఇలాంటి కాంట్రవర్సీలోనే ఇరుక్కున్నారు.
కొద్ది రోజుల క్రితం ఓ సీనియర్ స్టార్ యాక్ట్రెస్ గురించి ఆయన కామెంట్స్ చేశారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పాజిటివ్‌గానే కాకుండా నెగిటివ్‌గానూ రియాక్ట్ అయ్యారు నెటిజన్లు. ఆ పాత వీడియోనే మళ్లీ ఇప్పుడు వైరల్ అవుతోంది. తాను లండన్ నుంచి వస్తుండగా.. కరీనా కపూర్ ఫ్లైట్‌లో తన పక్కనే కూర్చుందని.. ‘ప్రయాణికులు చాలా మంది ఆమెను చూసి హాయ్ అని పలకరించినా కానీ ఆమె స్పందించలేదు. మనల్ని ఎవరైనా పలకరించినప్పుడు తిరిగి మాట్లాడితే బాగుంటుంది. మన నుండి వాళ్లు కోరుకునేది అదే కదా’ అన్నారాయన. దీంతో అక్కడున్నవారు ఆశ్యర్యపోయారు. వెంటనే నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి కలగజేసుకుని.. ‘బహుశా ఆమె విసిగిపోయి ఉంటుందేమో.. నారాయణ మూర్తి ఓ సాఫ్ట్‌వేర్ పర్సన్, కంపెనీ ఫౌండర్. నీకు 10 వేల మంది అభిమానులుంటారేమో.. కానీ కరీనాకు కోట్లలో ఫ్యాన్స్ ఉంటారు’ అనగానే అందరూ నవ్వేశారు.
అయితే నారాయణ మూర్తి అంతటితో ఆగకుండా.. మరింత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘ఇక్కడ సమస్య అది కాదు. ఎవరైనా మన మీద అభిమానం చూపించినప్పుడు మనం కూడా దాన్ని తిరిగి ఇవ్వగలగాలి. ఏ రూపంలోనైనా. అదే ముఖ్యమని నేనుకుంటున్నాను. ఇవన్నీ మనలోని అహాన్ని తగ్గించే మార్గాలు అంతే’ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మద్దతు తెలుపుతుంటే.. మరి కొందరు సమాజంలో గొప్పవ్యక్తి మీరు. అలాంటిది ఒక మహిళ, అందులోనూ సెలబ్రిటీ గురించి ఇలా పబ్లిక్‌గా మీ అభిప్రాయాన్ని చెప్పి ఉండాల్సింది కాదు’ అంటున్నారు.