మళ్లీ పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయిపోయినట్లు ఉంది. కొన్నాళ్ల ముందు నటీనటులకు సంబంధించి వరసగా మ్యారేజెస్ జరిగాయి. ఇప్పుడు మళ్లీ ఆ ట్రెండ్ ప్రారంభమైనట్లు ఉంది. తెలుగు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఓ కన్నడ భామ తాజాగా పెళ్లి పీటలెక్కింది. అందుకు సంబంధించిన ఫొటోల్ని కూడా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో తోటి హీరోయిన్స్ నేహాశెట్టి, ప్రణీత, శాన్వి, సంయుక్త హెగ్డే తదితరులు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలే సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ శుభ్ర అయ్యప్ప.. కొత్త ఏడాదిలో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసింది. బ్యాచ్ లర్ లైఫ్ కు పుల్ స్టాప్ పెట్టేసి పెళ్లి పీటలెక్కింది. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విశాల్ శివప్పతో ఏడడుగులు వేసింది. చాలా తక్కువమంది బంధు మిత్రుల సమక్షంలో గురువారం వీరి మ్యారేజ్ జరిగింది. విశాల్ పూర్వీకులకు చెందిన 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఓ ఇంట్లో ఈ వేడుకకు ఆతిథ్యమిచ్చింది. తన పెళ్లి వార్తను అభిమానులతో షేర్ చేసుకున్న శుభ్ర.. మెడలో తాళి పడిన సందర్భం, తన నుదుటన భర్త సింధూరం దిద్దిన క్షణాల ఫొటోలను ప్రధానంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇక ఈ పెళ్లి ఫొటోల్లో శుభ్ర.. తళతళా మెరిసిపోతుంది. దీనిపై స్పందించిన కన్నడ భామలు తదితరులు శుభ్ర-విశాల్ జోడీకి శుభాకాంక్షలు చెప్పారు. ఇదిలా ఉండగా.. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె.. సినిమాల్లోకి రాకముందు పలు యాడ్స్ లో నటించింది. సాయిధరమ్ తేజ్ ‘రేయ్’ మూవీతో ఈమె హీరోయిన్ కావాల్సింది కానీ పలు కారణాలతో ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకొంది. ఆ తర్వాత నారా రోహిత్-శ్రీ విష్ణు నటించిన ‘ప్రతినిధి’ చిత్రంతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత తమిళ, కన్నడలో ఒక్కో సినిమా చేసింది. గతేడాది ‘తిమ్మయ్య & తిమ్మయ్య’ అనే చిత్రం చేసింది. ప్రస్తుతం ‘రామణ అవతార’ అనే మూవీతో బిజీగా ఉంది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత నటిస్తుందా లేదా యాక్టింగ్ కు పుల్ స్టాప్ పెట్టేస్తుందా అనేది చూడాలి.