'కేజీఎఫ్' కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ వెంకటేష్ మహా.. ఒక్కసారిగా న్యూస్ లో హాట్ టాపిక్ అయిపోయాడు. ఇప్పుడు తన కామెంట్స్ పై స్పందిస్తూ మరో వీడియోని రిలీజ్ చేశాడు.
ఎప్పుడో రిలీజై, బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు సునామీ సృష్టించిన ‘కేజీఎఫ్’ మూవీ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దానికి కారణం ‘కేరాఫ్ కంచరపాలెం’ డైరెక్టర్. ఈ సినిమాలో హీరోని నీచ్ కమీన్ కుత్తే అంటూ అనడం పెద్ద వివాదం అయిపోయింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా జరిగిన ఈ సంఘటన.. తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ దగ్గర నుంచి యష్ అభిమానుల వరకు చాలామంది దారుణంగా ట్రోల్ చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే స్వయనా ఆ కామెంట్స్ చేసిన డైరెక్టర్ కూడా సారీ చెబుతూ ఓ వీడియోని రిలీజ్ చేశాడు. కానీ అందులో చిన్న మెలిక పెట్టి వదిలేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏ సినిమా అయినా సరే అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. వేల కోట్ల వసూళ్లు సాధించిన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మూవీస్ కూడా కొందరికీ నచ్చకపోవచ్చు. అయితే నచ్చకపోతే నచ్చలేదని చెప్పి సైలెంట్ గా ఊరుకుంటారు. కానీ ఓ డైరెక్టర్ అయ్యుండి.. ‘కేజీఎఫ్’ స్టోరీపై, హీరో పాత్ర గురించి ‘నీచ్ కమీన్ కుత్తే’ అంటూ కాస్త ర్యాష్ గానే డైరెక్టర్ వెంకటేష్ మహా మాట్లాడేశాడు. ఇది చాలామందికి నచ్చలేదు. వెంకటేష్ మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న వివేక్ ఆత్రేయ, ఇంద్రగంటి మోహనకృష్ణ, నందిని రెడ్డి కూడా తెగ నవ్వుకున్నారు. ఇప్పుడు వాళ్లందరూ క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు వెంకటేష్ మహా కూడా ఓ వీడియో రిలీజ్ చేశాడు.
‘రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో, ఒకానొక సందర్భంలో నేను వ్యక్తపరిచిన ఓపెనియన్ చాలామందికి అభ్యంతరకరంగా అనిపించిందని తెలిసింది. అయితే నేను అన్న మాటల్ని వెనక్కి తీసుకోవట్లేదు. కానీ ఓ టైంలో నేను వాడిన భాష, బహుశా సరైనది కాదు. నేనే ఒప్పుకుంటాను. గౌరవమైన డైరెక్టర్ గా నేను ఆ భాష ఉపయోగించి ఉండకూడదు. అది చాలామంది అభిమానులకు, నా సినిమాలు చూసే ప్రేక్షకులకి.. ఆ భాష అభ్యంతరకరంగా అనిపించింది. దానికి మాత్రమే నేను సారీ చెబుతున్నాను. నా ఒపీనియన్ అయితే మారదు. ఓ ఇండస్ట్రీనో, ఓ వ్యక్తినో కించపరిచే ఉద్దేశంతో అన్న మాటలు కావవి. అన్ని సినిమాలను ఆదరించాలనేది నా అభిప్రాయం’ అని వెంకటేష్ మహా తన వీడియోలో చెప్పుకొచ్చాడు. మరి ఇతడి కామెంట్స్, ఆపై సారీ చెప్పనంటూ మరో వీడియో రిలీజ్ చేయడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
— Venkatesh Maha (@mahaisnotanoun) March 6, 2023