టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రాజకీయాల్లోకి ఎంట్రీపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేరుతో నిర్మాణ సంస్థను నెలకొల్పి పలు సినిమాలను నిర్మించి ఊహకందని రీతిలో విజయాలను అందుకున్న ఘనత నిర్మాత దిల్ రాజుకు దక్కుతుంది. టాలీవుడ్ తో పాటు, బాలీవుడ్ లో కూడా పలు సినిమాలను నిర్మించారు. మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది అన్న రీతిలో తను ఏ సినిమా నిర్మించిన సూపర్ హిట్ విజయాన్ని సాధిస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. కాగా సినిమాలే లోకంగా భావించే దిల్ రాజు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ.. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావడం ఖాయమన్నట్లుగా వెల్లడించాడు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు తన ప్యానల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం చిన్న, పెద్ద ప్రొడ్యూసర్లు అందరు తనను ప్రెసిడెంట్ గా ఉండాలని కోరుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ రాజకీయాల గురించి ప్రశ్నించినప్పుడు దిల్ రాజు మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది.. కానీ ఎప్పుడనేది చెప్పలేం. కానీ ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసినా ఎంపీగా గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
కానీ రాజకీయాలకంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కే ప్రాధాన్యత ఇస్తానని దిల్ రాజు స్పష్టం చేశారు. నేను ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఉంటే సినీ ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని సినీ ఇండస్ట్రీలోని మిత్రులు కోరుకుంటున్నారని తెలిపారు. కాగా రేపు ఉదయం 8 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభంకానుంది. అయితే కొన్ని నెలల్లో ఎన్నికలు రానున్న వేళ నిర్మాత దిల్ రాజు రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు తను ఏ పార్టీ తీర్ధం పుచ్చుకుంటారో అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.