అక్కినేని నట వారసుడు అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా విషయంలో కుట్ర జరిగిందని నిర్మాత నట్టి కుమార్ సంచలన కామెంట్స్ చేశారు.
టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్స్లో అక్కినేని అఖిల్ ఒకరు. అభిమానులు ఆయన్ను ప్రేమతో అయ్య గారు అని పిలుస్తుంటారు. అలాంటి అఖిల్ ఈ శుక్రవారం ‘ఏజెంట్’ సినిమాతో థియేటర్లలోకి అడుగుపెట్టారు. అఖిల్ చేసిన ప్రతి చిత్రంపై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ తప్ప మిగతా మూవీస్‌కు ఆయనకు నిరాశనే మిగిల్చాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ‘ఏజెంట్’ సినిమాకు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఫిల్మ్ కోసం స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో జట్టు కట్టారు అయ్య గారు. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ‘ఏజెంట్’ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.
‘ఏజెంట్’కు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తున్నప్పటికీ.. అఖిల్ నటన, ఫైట్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయ్య గారు ఈ మూవీ కోసం ప్రాణం పెట్టి పనిచేశాడని.. అది తెర మీద కనిపిస్తోందని మెచ్చుకుంటున్నారు. అఖిల్ ‘ఏజెంట్’తో పాటు దర్శక దిగ్గజం మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్-2’ కూడా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఇవాళే విడుదలైంది. ఇదిలా ఉండగా.. ‘ఏజెంట్’ చిత్రం వెనుక పెద్ద కుట్రే జరిగిందని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఆరోపించారు. అక్కినేని హీరో అఖిల్‌ను కావాలని తొక్కిపడేశారంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు.
‘ఏజెంట్’ చిత్రం వెనుక జరిగిన కుట్రలో బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్లది ప్రధాన పాత్ర అని నట్టి కుమార్ ఆరోపించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అఖిల్ సినిమాకు కావాలనే థియేటర్లు దొరక్కుండా చేశారన్నారు. ‘ఏజెంట్ ఫిల్మ్ వెనుక చాలా రాజకీయాలు, ఎత్తుగడలు ఉన్నాయి. ఎత్తుగడల్లో ముల్లులు కూడా ఉన్నాయి. వాటిని దాటుకుని రావడం అఖిల్‌కు పెద్ద టాస్క్. అక్కినేని ఫ్యామిలీ హీరోను తొక్కడానికి దిల్ రాజు ‘పొన్నియిన్ సెల్వన్-2’ సినిమాను షిఫ్ట్ చేశారు. తెలుగు చిత్రానికి కాకుండా తమిళ మూవీకి ప్రయారిటీ ఇచ్చారు. మణిరత్నం గొప్ప దర్శకుడే కావొచ్చు. కానీ మా మటుకు తెలుగు సినిమానే మాకు గొప్ప. ఇన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి తీసిన చిత్రానికి డిస్ట్రిబ్యూటర్స్ దొరక్కుండా భయభ్రాంతులకు గురిచేశారు’ అని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు.
‘ఏజెంట్’ చిత్రాన్ని తొలుత ఏషియన్ సునీల్ కొన్నారని.. కానీ దిల్ రాజు, శిరీష్ రంగంలోకి దిగి, ఎవర్నీ కొనొద్దని చెప్పారని నట్టి కుమార్ పేర్కొన్నారు. ఒకవేళ కొంటే థియేటర్లు ఇవ్వొద్దని బెదిరించారన్నారు. ఇన్నేళ్లుగా మూవీ ఇండస్ట్రీలో ఉన్న అక్కినేని ఫ్యామిలీ హీరోకు ఇలా జరుగుతుంటే నాగార్జున ఏం చేస్తున్నారని నట్టి కుమార్ ప్రశ్నించారు. ఇంతా జరుగుతుంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఉన్న సుప్రియ ఏం చేస్తున్నారని ఆయన క్వశ్చన్ చేశారు. టాలీవుడ్లో మోనోపలి వ్యవస్థ నడుస్తోందని.. దీన్ని ఇటు అగ్ర నిర్మాతలు గానీ, అటు ప్రభుత్వం గానీ కట్టడి చేయలేకపోతోందని నట్టి కుమార్ విమర్శించారు. దిల్ రాజు, శిరీష్‌లు సినిమా మార్కెట్‌ను చంపేశారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.