తప్పు చేసిన వాడు మనిషి, ఆ తప్పుని క్షమించగలిగిన వాడు పెద్ద మనిషి అనే మాటను నిజం చేశారు సీనియర్ నటి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి శోభన. అందం, అభినయం, నాట్యంతో సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారామె.
తప్పు చేసిన వాడు మనిషి, ఆ తప్పుని క్షమించగలిగిన వాడు పెద్ద మనిషి అనే మాటను నిజం చేశారు సీనియర్ నటి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి శోభన. అందం, అభినయం, నాట్యంతో సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారామె. వెంకటేష్ ‘సంక్రాంతి’ సినిమాలో కమెడియన్ సుధాకర్ దొంగతనానికి వస్తే అతనికి అన్నం పెట్టి మరీ పనిలో పెట్టుకుంటారు కదా.. ఇంచుమించు అంతకంటే గొప్ప పనే చేశారు శోభన. ఇటీవల తన ఇంట్లో పని చేసే మహిళ నగదు దొంగిలించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారామె. తప్పు చేసినా సరే సాయం చేసి సాటి మహిళగా మంచి మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శోభన చెన్నైలోని తేనాంపేట, శ్రీమాన్ శ్రీనివాస కాలనీలో తల్లితో కలిసి ఉంటున్నారు.
రెండు ఫ్లోర్లు గల ఇంటిలో పై భాగంలో వీరు నివసిస్తూ.. కింద పోర్షన్‌లో డ్యాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లికి సపరిచర్యలు చేయడానికి కడలూరు జిల్లా, కొట్టుమన్నార్ కోవిల్‌కు చెందిన విజయ అనే మహిళను పనిలో పెట్టుకున్నారు శోభన. కాగా గత కొద్ది రోజులుగా తన తల్లి డబ్బు చోరికి గురవుతున్న విషయాన్ని గుర్తించిన శోభన.. ఇంట్లోకి ఇతరులెవరూ వచ్చే అవకాశం లేకపోవడంతో పనిమనిషి విజయను ప్రశ్నించారు. తనకేమీ తెలియదని బుకాయించింది. దీంతో శోభన స్థానిక తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విజయను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకుంది.
గత మార్చి నెల నుంచి దాదాపు రూ.41 వేల వరకు దొంగిలించినట్లు అంగీకరించింది. డబ్బును కారు డ్రైవర్ మురుగన్ ద్వారా తన కూతురికి గూగూల్ పే చేయించినట్లు వెల్లడించింది. పేదరికం కారణంగానే దొంగతనం చేశానని, తనను పని నుంచి తీసెయ్యవద్దని పోలీసుల ద్వారా శోభనను వేడుకుంది విజయ. దీంతో ఆమెపై కేసు నమోదు చెయ్యొద్దని పోలీసులకు చెప్పి, పనిమనిషిని పనిలో నుంచి తీసెయ్యకుండా.. ఆమె చోరీ చేసిన రూ.41 వేలను తన జీతంలో కట్ చేయనున్నట్లు పోలీసులకు తెలిపారు. మరోసారి ఇలాంటి పనులు చెయ్యొద్దని, డబ్బు అవసరం అయితే తనను అడగాలని పని మనిషికి సూచించారు శోభన. దీంతో ఆమె మంచి మనసును అభినందిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.