సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం.. అదో వింత మాయాజాలం.. ఒక్కసారి పరిశ్రమలోకి ప్రవేశించాక, గుర్తింపు రావడానికి కష్ట పడాలి.. దాన్ని నిలబెట్టుకోవడానికి అనుక్షణం జాగ్రత్త పడాలి.
సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం.. అదో వింత మాయాజాలం.. ఒక్కసారి పరిశ్రమలోకి ప్రవేశించాక, గుర్తింపు రావడానికి కష్ట పడాలి.. దాన్ని నిలబెట్టుకోవడానికి అనుక్షణం జాగ్రత్త పడాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన.. అవకాశాలు వచ్చినప్పుడే, ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకునే తెలివి తేటలుండాలి. అప్పుడే ఛాన్సులు రాకపోయినా, వయసుపైబడినా హాయిగా బతికొచ్చు. లేదంటే, స్టార్లగా చెలామణీ అయ్యి.. దిక్కుతోచని స్థితిలో తనువు చాలించిన ఎందరో మహా మహుల జీవితాల్లాగే వారి కథ కూడా విషాదంగానే ముగుస్తుంది. నేమ్, ఫేమ్ ఉన్నప్పుడు ఎవరైనా చుట్టూ చేరతారు. ఒక్కసారి ఫేడౌట్ అయ్యాక ఎవ్వరూ ముఖం కూడా చూడరు. అలాంటి దీన స్థితిలో తప్పటడుగులు వేసింది నిషా నూర్. నటనను నమ్ముకున్న ఆమె, తర్వాత పరిస్థితుల కారణంగా వ్యభిచారిగా మారింది. అసలు ఇంతకీ ఎవరీ నిషా నూర్.. ఏంటామె కథ?.. ఇప్పుడు చూద్దాం.
స్టార్ హీరోయిన్‌గా..
1962 సెప్టెంబర్ 18న తమిళనాడులోని నాగపట్నంలో పుట్టిన నిషా.. తన 18వ ఏట ‘మంగళ నాయగి’ అనే తమిళ్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. 80వ దశకంలో తన గ్లామర్‌తో సిల్వర్ స్క్రీన్‌ను మరింత బ్యూటిఫుల్‌గా మార్చేసింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో నటించి, స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. రజినీ కాంత్, కమల్ హాసన్, భాను చందర్, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో ఆడి పాడింది. కమల్‌తో ‘టిక్ టిక్ టిక్’, రాజేంద్ర ప్రసాద్ పక్కన ‘ఇనిమై ఇదో ఇదో’, మమ్ముట్టితో ‘అయ్యర్ ది గ్రేట్’, మోహన్ లాల్‌తో ‘దేవసురమ్’ వంటి చిత్రాలు చేసింది.
సినిమాల్లేక తప్పుడు మార్గంలోకి..
తన అందచందాలతో యువతకు ‘నిషా’ ఎక్కించేసింది. అలాంటిది 1995 తర్వాత ఆమెకు ఒక్కటంటే ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. స్టార్ స్టేటస్ అనుభవించిన నిషా, అవకాశాల కోసం తల్లడిల్లిపోయింది. ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో సినిమాలు వదిలేసింది. సంపాదించుకున్నదంతా కరిగిపోయింది. బతకడానికి ఏదో ఒక పనిచెయ్యాలి. తప్పదు. కానీ, దాని కోసం ఆమె తప్పుడు మార్గాన్ని ఎంచుకుని, వ్యభిచార వృత్తిలోకి దిగింది. ఓ నిర్మాత బలవంతం వల్లే ఈ రొంపిలోకి దిగిందని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఇక సినీ పరిశ్రమ నుండి కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందకపోవడంతో ఇదే వృత్తిలో కొనసాగింది.
ఎయిడ్స్ వ్యాధి సోకడంతో..
ఒకానొక సమయంలో తల దాచుకోవడానికి కూడా స్థలం లేకపోవడంతో.. ఓ దర్గా వెలుపల నిద్రించింది. అప్పటికే బక్కచిక్కి గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఆమె దీన స్థితిని చూసి ఓ తమిళ ఎన్జీవో సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఆరోగ్య పరీక్షలు చేయగా అప్పటికే ఎయిడ్స్ ఉన్నట్లు తేలింది. ఆ మహమ్మారితో పోరాడుతూ 2007 ఏప్రిల్ 23న అనాధలా కన్నుమూసింది నిషా నూర్.