నటి అర్థనా బిను తన తండ్రి విజయ్ కుమార్ మీద సంచలన ఆరోపణలు చేసింది. తమను బెదిరిస్తున్నాడని, పోలీసులకు చెప్పినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది.
నటి అర్థనా బిను తన తండ్రి విజయ్ కుమార్ మీద సంచలన ఆరోపణలు చేసింది. తల్లి విడాకులు తీసుకోగా.. తల్లి, సోదరితో కలిసి ఉంటుందామె. విడిపోయినప్పటికీ తండ్రి అప్పుడప్పుడు అక్రమంగా తమ ఇంటికి వచ్చి గందరగోళం సృష్టిస్తున్నాడని, తమను బెదిరిస్తున్నాడని, పోలీసులకు చెప్పినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. రీసెంట్‌గా తమ ఇంట్లోకి ప్రవేశించి, గొడవ చేస్తున్న తండ్రి వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది అర్థనా బిను. విజయ్ కుమార్ మలయాళంలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అర్థనా, రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. తమిళ్, మలయాళంలో బిజీగా మారింది. కార్తీ నటించిన ‘చినబాబు’ (తమిళ్ డబ్బింగ్ మూవీ) మంచి పేరు తెచ్చుకుంది. మోడల్, టీవీ ప్రజెంటర్ అయిన అర్థనా, తండ్రి విజయ్ కుమార్ వీడియో షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చింది. ‘అతను అక్రమంగా మా ఇంటి కాంపౌండ్‌లోకి వచ్చాడు. అప్పటికే మేం లోపల నుండి తలుపులు లాక్ చేయడంతో, కిటికీలో నుండి బెదిరింపులకు దిగాడు. నా చెల్లెలితో పాటు అందర్నీ చంపేస్తానని వార్న్ చేస్తున్నాడు. అంతేకాదు, సినిమాల్లో నటించడం మానెయ్యాలని.. లేదా, తను చెప్పిన సినిమాల్లో మాత్రమే యాక్ట్ చెయ్యాలని కండీషన్ పెడుతున్నాడు. తన ఉండే నటుల గురించి కూడా తప్పుగా మాట్లాడుతున్నాడు. ఇది వరకు మా అమ్మ పని చేసే చోటు, మా చెల్లి చదువుకునే కాలేజీకి వెళ్లి గొడవ చేసినందుకు కోర్టులో కేస్ నడుస్తుంది. అయినా మా ఇంటికొచ్చి గోల చేస్తున్నాడు’ అని చెప్పుకొచ్చింది.
అలాగే మమ్ముట్టి హీరోగా వచ్చిన ‘షైలాక్’ సినిమాలో నటిస్తున్నప్పుడు తనపై లీగల్‌గా కేసు పెట్టాడని.. దాంతో ఆ సినిమా ఆగిపోకుండా ఉండేందుకు నా సొంత ఇష్టానుసారమే నటిస్తున్నట్లు చట్టపరమైన పత్రాలపై సంతకం చెయ్యాల్సి వచ్చిందని తెలిపింది. అర్థనా బిను షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండడంతో పోలీసులు స్పందిస్తారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.