సమాజంలో రోజు రోజుకు నేరప్రవృత్తి పెరిగిపోతుంది. ఆస్తుల కోసం చంపుకోవడం, ఆర్థికపరమైన విషయాల్లో తలెత్తిన వివాదాలు హత్యలకు దారితీస్తున్నాయి. ఇవి కాక ఈ మధ్య కాలంలో అక్రమసంబంధాలు, ప్రేమ వ్యవహారాల్లో చోటుచేసుకున్న ఘర్షనలు హింసాత్మకంగా మారుతున్నాయి.
మనుషులమన్నా సంగతి మరిచి మృగాల లాగా వ్యవహరిస్తున్నారు కొందరు వ్యక్తులు. దీంతో మహిళలకు సమాజంలో రక్షణ లేకుండా పోతుంది. మహిళా రక్షణ కోసం ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకుంటున్నప్పటికి జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మనస్పూర్తిగా ఒకరిని ఒకరు ప్రేమించుకున్నవారు కూడా ఏవేవో కారణాలతో హత్యల వరకు వెళుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకుని కొంత కాలానికే వివాదాలు చెలరేగి భార్యను భర్త అతి కిరాతకంగా హత్యచేసిన ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే… గాజువాకకు చెందిన శ్రీనివాస్, ఆగనంపూడికి చెందిన మహాలక్ష్మీ మూడు సంత్సరాల క్రితం ప్రేమించుకున్నారు. కులాలు వేరుకావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వారు పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. అలా కొంతకాలం కాపురం చేయసాగారు. అయితే అత్తింటి వారు ఎస్టీ కులానికి చెందిన మహాలక్ష్మీని ఇంటిపనులు రావని, కట్నం విషయంలో వేధిస్తుండేవారు. దీనికి తోడు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కూడా వేధించసాగాడు. దీంతో మహాలక్ష్మీ పుట్టింటికి వెళ్లిపోయింది. అతని వేధింపులు తట్టుకోలేక దువ్వాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కాగా విడాకులు కావాలని మహాలక్ష్మీ కోరడంతో ఫ్యామిలీ కోర్టుకు వెళ్లాలని పోలీసులు సూచించారు.
దీంతో మహాలక్ష్మీ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దీంతో భర్త శ్రీనివాస్ ఆమెపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను అంతమొందించాలని పథకం వేశాడు. మే 29న అచ్యుతాపురంలో ఓ లాడ్జ్ లో రూం తీసుకుని మాయమాటలు చెప్పి మహాలక్ష్మిని రప్పించాడు. లాడ్జ్ రూంలో అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. వీరి అరుపులు విన్న పక్క రూం లోని వారు హోటల్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వచ్చిన సిబ్బంది గది తలుపులు తెరిచి చూడగా రక్తపు మడుగులో మహాలక్ష్మీ పడి ఉంది. వెంటనే ఓ అసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలిస్తుండగా మృతిచెందింది. మహాలక్ష్మీ మృతికి కారణమైన శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా విడాకులు ఇస్తే తన జీవితం నాశనమవుతుందని భావించి ఆమెపై కక్ష్య పెంచుకుని హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు డిఎస్పి తెలిపారు.