ఇటీవల తమిళ స్టార్ సూర్య హీరోగా విడుదలైన చిత్రం జైభీమ్. ఈ మూవీలో చేయని తప్పుకి పోలీసులు బలహీన వర్గాలకు చెందిన కొందరు ట్రైబల్ వ్యక్తులను అరెస్ట్ చేసి జైళ్లో తీవ్ర హింసకు గురి చేసి చంపేస్తారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా కర్ణాటకలో చోటు చేసుకుంది. పోలీసుల టార్చర్ తట్టుకోలేక కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటంతో ఐదుగురు మరణించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని గల్‌పేట పరిధిలోని కారంజికట్టలో ఒకే కుటుంబానికి చెందిన మునియప్ప (75), భార్య నారాయణమ్మ(70), కుమారుడు బాబు (45), మనవరాలు గంగోత్రి, కుమార్తె పుష్ప నివాసం ఉంటున్నారు. అయితే అక్టోబర్ 18వ తేదీన తాలూకాలోని హొన్నేహళ్లి గ్రామానికి చెందిన సత్య, సుమిత్ర దంపతుల కుమర్తెను తమకు తెలిసిన వ్యక్తులు ఎత్తికెళ్లారట. దీంతో గీతా, పుష్పలను అనుమానంతో మహిళా పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు.
నేరాన్ని ఒప్పుకోవాలంటూ వేధించటంతో తమ కుటుంబం పరువు పోతుందని భావించిన పుష్ప కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే పురుగుల మందు తాగి అందరూ ఆత్మహత్య చేసుకున్నారు. ముందుగా పుష్ప మరణించగా ఆ తర్వాత కుటుంబంలోని నలుగురు మరణించారు. చేయని నేరానికి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవటంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.