పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 40 మంది చనిపోగా.. 8 మందికి గాయాలయ్యాయి. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. లాస్‌బెలా అసిస్టెంట్ కమిషనర్ హజ్మా అంజుమ్ తెలిపిన వివరాల మేరకు.. ఓ ఆర్టీసీ బస్సు 48 మంది ప్రయాణికులతో రాత్రి వేళ క్వెటానుంచి కరాచికి ప్రయాణిస్తోంది. అర్థరాత్రి సమయంలో లాస్‌బెల దగ్గరలోని ఓ బ్రిడ్జిమీద బస్సు వెళుతూ ఉంది. అతి వేగం కారణంగా యూటర్న్ తీసుకునే సమయంలో ప్రమాదం జరిగింది. బస్సు ఓ బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొట్టింది.
ఆ వెంటనే బ్రిడ్జి మీదనుంచి లోయలో పడిపోయింది. కిందపడిన వెంటనే బస్సు నుజ్జునుజ్జయింది. ఆ తర్వాత బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మొత్తం 40 మంది ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. మిగిలిన వారు గాయపడ్డారు. బ్రిడ్జిపై వెళుతున్న వాహనదారులు దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ప్రమాదం జరగటానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. పూర్తిగా దెబ్బ తిన్న వారి శరీర భాగాలను గుర్తించే పనిలో పడ్డామన్నారు. కాగా, రోడ్డు సేఫ్టీ ప్రమాణాలు సరిగా లేకపోవటం వల్ల పాకిస్తాన్‌లో ప్రతీ ఏటా వేల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. వేల మంది తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. 2018 సంవత్సరంలో దాదాపు 27 వేల మంది రోడ్డు ప్రమాదాల కారణంగా తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. మరి, ఈ ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.