ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు నిన్న నిర్వహించిన ‘చలో విజయవాడ’ ఊహించిన దానికి మించి విజయవంతమైంది. ఉప్పెనలా తరలి వచ్చిన ఉద్యోగులను వారించడం పోలీసు తరం కూడా కాలేదు. పోలీసుల నిర్బంధాన్ని ఛేదించుకుని లక్షలాదిమంది ఉద్యోగులు విజయవాడ తరలివచ్చి తమ సత్తా చాటారు. అయితే ‘చలో విజయవాడ’ విజయం పై అధికార పక్ష నేతలు కొంత మంది తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా దీనిపై స్పందించారు పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి. ఉద్యోగుల ‘చలో విజయవాడ’ కార్యక్రమంలో తెదేపా, జనసేన, ఇతర రాజకీయ పార్టీల వ్యక్తులు ఎవరూ పాల్గొనలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో అవాస్తవాలు ప్రచారం చేయొద్దని కోరారు. విజయవాడ చరిత్రలోనే ఇలాంటి కార్యక్రమం లేదని, అయితే కొందరు వ్యక్తులు ఉద్యోగుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయత్నం చేశారని వెల్లడించారు.
ఇది చదవండి : బిడ్డను ఎత్తుకొని లైవ్ లో వార్తలు.. వీడియో వైరల్!
కొందరు వ్యక్తులు ఉద్యోగుల పట్ల ప్రజలల్లో వ్యతిరేక భావన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిన్నటి ఆందోళనపై ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యమానికి పోలీసులు సహకరించారని చేసిన ఆరోపణల్లో నిజం లేదని, ఘర్షణ వాతావరణం రాకుండా పోలీసులు వ్యవహరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రేపు సెలవు రోజు కావడంతో నేడే సచివాలయంలో పెన్‌డౌన్ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. సీఎస్ సమీర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చిస్తామన్నారు.