ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. పోలీస్ బాస్ ను ఇంత సడెన్ గా ఎందుకు బదిలీ చేశారు.. ఇది సాధారణ బదిలీయేనా.. లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా.. అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అటు ప్రతిపక్షాలు కూడా కావాలనే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సవాంగ్ ని బదిలీ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇది సాధారణ బదిలీనే అని వివరణ ఇచ్చింది. గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. రిలీవైన కొద్ది గంటల్లోనే సవాంగ్ కేంద్ర సర్వీస్‌లోకి బదిలీ అయ్యారు.
సాధారణంగా ఏ ప్రభుత్వంలో అయినా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు సర్వసాధారణమే. పరిపాలనకు అనుకూలంగా, వారి సామర్థ్యానికి అనుగుణంగా పోస్టింగ్స్ ఇస్తుంటుంది. గౌతమ్ సవాంగ్ ఏపీ డీజీపీగా సుమారు రెండున్నరేళ్లకు పైగా పని చేశారు. గతంలో చంద్రబాబు.. ఆయన ఐదేళ్ల పాలన కాలంలో ఏకంగా నలుగురు డీజీపీలను మార్చారు. ఇక సవాంగ్ విషయానికి వస్తే.. ఆయన డీజీపీగా పని చేసినంత కాలం ప్రభుత్వంతో మంచి సంబంధాలనే కొనసాగించారు. బెస్ట్ పోలీస్ చీఫ్ గా ప్రశంసలు కూడా పొందారు. పదవీలో ఉన్నంత కాలం.. ప్రభుత్వం ఆయన విధుల్లో జోక్యం చేసుకోవడం జరగలేదు. విపక్షాలు ఆయనపై ఎన్ని విమర్శలు చేసినా.. ప్రభుత్వం నుంచి మాత్రం సవాంగ్ కి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చింది.
చలో విజయవాడ విజయవంతం కావడం వల్లేనా
సవాంగ్ బదిలీకివే కారణం అంటూ కొన్ని వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి. వాటిల్లో ప్రధానమైంది.. పీఆర్సీ ఆందోళనలో భాగంగా ఉద్యోగులు చేపట్టిన ‘చలో విజయవాడ’ విజయవంతం కావడం. పోలీసులు ఉద్యోగులకు మద్దతు తెలిపారని.. వారి సహకారంతోనే చలో విజయవాడ విజయవంతం అయ్యిందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో సవాంగ్ పై ప్రభుత్వం గుర్రుగా ఉందని.. ‘చలో విజయవాడ’ అనంతరమే ఈ విషయమై సవాంగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు వినిపించాయి.
అయితే ఇక్కడ ఓ చిన్న పాయింట్ ని మర్చిపోతున్నారు. ‘చలో విజయవాడ’ కార్యక్రమంలో సుమారు 50-60 వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉద్యోగులను కట్టడి చేయడం విజయవాడ నగర పోలీసుల వల్ల అవుతుందా.. పోనీ ఇతర నగరాల నుంచి ఫోర్స్ ను దించినా.. ఎంత మంది అవుతారు.. అనేది ఆలోచించాలి. ఇంత చిన్న విషయం ప్రభుత్వం ఆలోచించదా.. కనుక ‘చలో విజయవాడ’ కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అనడం పూర్తిగా అసంబద్ధం.
విశాఖలో పెద్ద ఎత్తున గంజాయి తగలబెట్టడం..
తాజాగా ఏపీ పోలీసులు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున అంటే 2 లక్షల కేజీల గంజాయిని దహనం చేశారు. దీని విలువ సుమారు 850 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. మీడియా ముఖంగా జరిగిన ఈ కార్యక్రమంలో డీజీపీ సవాంగ్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ గంజాయి కొందరు రాజకీయ ప్రముఖులకు చెందినదని.. సవాంగ్ అత్యుత్సాహంతో.. దీన్ని తగలబెట్టాడని.. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతోనే.. సవాంగ్ ను బదిలీ చేశారని మరో ఆరోపణ వినిపిస్తోంది. అయితే ఈ గంజాయి ఒకేసారి పట్టుబడింది కాదు.. గత రెండేళ్ల కాలం నుంచి పోలీసుల తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నది. ఇక ప్రభుత్వ అనుమతితోనే దీన్ని తగలబెట్టడం చేశారు. అందుకే మీడియా సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కనుక ఈ కారణం చేత సవాంగ్ ను బదిలీ చేశారనడం కూడా కరెక్ట్ కాదు అనే వాదన వినిపిస్తోంది. సాధారణ బదిలీల్లో భాగంగానే ప్రభుత్వం సవాంగ్ ని ట్రాన్స్‌ఫర్ చేసింది.. తప్ప వ్యక్తిగత కారణాలు లేవంటున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.